Delhi Services Bill: పంతం నెగ్గించుకున్న కేంద్రం, ఢిల్లీ సర్వీస్ బిల్‌కి రాష్ట్రపతి ఆమోదం - గెజిట్ విడుదల
Delhi Services Bill: ఢిల్లీ సర్వీస్ బిల్‌కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
Delhi Services Bill:
రాష్ట్రపతి ఆమోద ముద్ర
కేంద్రం ప్రతిపాదించిన ఢిల్లీ సర్వీస్ యాక్ట్ (Delhi Services Act) బిల్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఫలితంగా...ఇది అధికారికంగా చట్టంగా మారిపోయింది. ఆగస్టు 1వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా National Capital Territory of Delhi బిల్‌ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీలోని పాలనా వ్యవహారాలపై కేంద్రానికి అధికారాలు కల్పించే బిల్లు ఇది. ఆప్ సహా పలు పార్టీలు దీన్ని వ్యతిరేకించినప్పటికీ బిల్ ప్రవేశపెట్టారు షా. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పూర్తవడం వల్ల చట్టంగా మారిపోయింది. ఆగస్టు 7న రాజ్యసభలో ఈ బిల్ పాస్ అయింది. 132 ఓట్లు అనుకూలంగా రాగా...102 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. YSRCP,BJD పార్టీలు కేంద్రానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ బిల్లు ప్రజాస్వామ్య విధానానికే వ్యతిరేకం అని ఆప్ విమర్శించింది. పాలనా వ్యవహారాల్లో కేంద్రం జోక్యం ఉండకూడదని నిరసిస్తున్న ఆప్ వైఖరికి వ్యతిరేకంగా బిల్ తీసుకొచ్చింది కేంద్రం. ఢిల్లీలోని అధికారులను బదిలీ చేయాలన్నా, తొలగించాలన్నా అంతా కేంద్రం అధీనంలోనే ఉంటుంది. దీన్ని చాలా సందర్భాల్లో వ్యతిరేకించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. సీఎం పదవి ఉన్నా...అధికారులు తాము చెప్పినట్టుగా నడుచుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలోనే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనాతోనూ విభేదాలు వచ్చాయి. దీనిపై ఆప్ న్యాయపోరాటం కూడా చేసింది. విజయం సాధించింది. కానీ...ఉన్నట్టుండి కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునీ పక్కన పెట్టింది.
Government of India issues gazette notification on Government of National Capital Territory of Delhi (Amendment) Act, 2023. pic.twitter.com/dNcUFQPQOh
— ANI (@ANI) August 12, 2023
లెఫ్టినెంట్ గవర్నర్‌కి ఢిల్లీలోని పరిపాలన సేవలపై నియంత్రణను అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటి నుంచి ఆప్ ప్రభుత్వం మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. కేజ్రీవాల్ ఆ బిల్లును వ్యతిరేకించాలని కాంగ్రెస్ సహా మిత్రపక్షాలను మద్దతు కోరడంతో.. విపక్ష పార్టీలు ఢిల్లీ సర్వీసుల బిల్లును వ్యతిరేకించాయి. ‘నేషనల్ కేపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ ఏర్పాటు చేసి గ్రూపు-ఎ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని మోదీ ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ ను చట్టం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల రిక్రూట్ మెంట్, బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు మే 11న తీర్పు ఇచ్చింది. అనంతరం మే 19న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఢిల్లీ సర్వీసుల బిల్లును ప్రవేశపెట్టింది. రెండు సభల్లోనూ ఆమోదం లభించగా...ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీలో అవినీతి రహిత పాలనను అందించాలన్న లక్ష్యంతోనే సర్వీసుల బిల్లును తెచ్చామన్నారు అమిత్ షా. తమపై విమర్శలు చేయడం కాదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లును తొలిసారిగా తీసుకొచ్చారని గుర్తుచేశారు.
Also Read: నాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు, ఓటు వేయమని వాళ్లను అడగను - అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ