Piyush Goyal Privilege Notice : కేంద్ర మంత్రికి ప్రివిలేజ్ నోటీస్, సభను తప్పుదోవ పట్టించారని టీఆర్ఎస్ ఆరోపణ
Piyush Goyal : ధాన్యం సేకరణపై కేంద్రం, రాష్ట్రం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై టీఆర్ఎస్ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టారు.
Piyush Goyal Privilege Notice : ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ వర్సెస్ కేంద్రం వార్ జరుగుతోంది. సీఎం కేసీఆర్ తో సహా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కేంద్రం తీరుపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రంపై పోరు ఆగదని స్పష్టం చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని నిరసనలు చేస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసినట్లే తెలంగాణలోనూ ధాన్యం సేకరిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని కేంద్ర మంత్రి అన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పచ్చి అబద్ధాలు
— TRS Party (@trspartyonline) April 4, 2022
బియ్యం, నూకలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని చెప్పడం, ఎగుమతులకు WTO ఆంక్షలు అడ్డొస్తున్నాయనడం, ధాన్యం సేకరణ నిమిత్తం కేంద్రం రాష్ట్రాలకు అడ్వాన్స్‌గా 90 శాతం నిధులు ఇస్తున్నట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. pic.twitter.com/yAN5dDXNeV
కేంద్ర మంత్రికి ప్రివిలేజ్ నోటీసు
కేంద్ర మంత్రి సభలో అవాస్తవాలు చెప్పారని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడుతున్నారు. దీంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానం పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించేలా ఉందని ఎంపీలు పేర్కొన్నారు. డబ్ల్యూటీవో నియమావళి నేపథ్యంలో
పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతులు చేయలేమని కేంద్ర మంత్రి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కానీ కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో మిలియన్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఉందని ఎంపీలు పేర్కొన్నారు. ప్రివిలేజ్ నోటీసును టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బి.బి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాలోతు కవిత, వెంకటేష్ నేత లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు అందజేశారు.
కేంద్ర మంత్రి ఏమన్నారంటే?
ధాన్యం సేకరణపై ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పారా బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాతపూర్వకంగా ఇచ్చిందన్నారు. ఎంవోయూ ప్రకారమే ముడి బియ్యం ఇస్తామని రాసిచ్చారని కేంద్రం మంత్రి ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ధాన్యం సేకరణపై సమాధానమిస్తూ పీయూష్ గోయల్ మాట్లాడుతూ కొత్తగా ధాన్యం సేకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. ధాన్యం సేకరణ అంశానికి సంబంధించి సీఎం దమ్కీలు ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై పీయూష్ గోయల్ పరోక్షంగా ఆరోపణలు చేశారు. పంజాబ్ తరహాలో కొనాలని తెలంగాణ సీఎం లేఖ రాశారని, పంజాబ్‌లో పండే బియ్యాన్ని దేశమంతటా తింటారన్నారు. పంజాబ్ లో పండేటటువంటి బియ్యాన్ని ఇవ్వాలన్నారు. రైతులను తప్పుదోవపట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణలో పండిన రా రైస్ మొత్తం తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.