Delhi Floods: దిల్లీలో వర్ష బీభత్సం, పొంచి ఉన్న యమున వరద ముప్పు - అలర్ట్ గా ఉన్నామన్న సీఎం కేజ్రీవాల్
Delhi Floods: దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. యమున నది ఉప్పొంగి ప్రవహిస్తుండగా వరద ముప్పు పొంచి ఉంది.
Delhi Floods: దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీ సహా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ లో సోమ, మంగళ వారాలు రెండు రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దిల్లీలోని యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదిలో వరద ప్రమాదం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే కుండపోత వానలతో అల్లాడుతున్న దేశ రాజధానికి యమునా నది రూపంలో మరో ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే దిల్లీలో కురుస్తున్న వానలకు ఎక్కడికక్కడే వాన నీరు నిలిచిపోయింది. వీటికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద తోడవనుంది. హర్యానాలో భారీగా కురుస్తున్న వర్షాలతో హత్నికుండ్ బ్యారేజీ గేట్లను ఎత్తివేసింది. ఈ నీరు దిల్లీని తాకనుంది. మంగళవారం మధ్యాహ్నం వరకు యమునా నది ప్రమాదక స్థాయికి మించి ప్రవహించనుంది. ఇప్పటికే కుండపోత వర్షాలతో ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద ప్రస్తుతం 203.18 మీటర్ల మేర వరద ప్రవహిస్తున్నట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. బ్రిడ్జి వద్ద వరద ప్రమాద స్థాయి 204.5 మీటర్లు కాగా.. హర్యానా నుంచి వచ్చే నీటితో ఇది 205.5 మీటర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ క్రమంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు.
దిల్లీ వర్షాల పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. యమునా నదికి వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యమునా నది ప్రవాహం 206 మీటర్ల మార్కును దాటగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. అయితే దిల్లీకి వరద పరిస్థితి తలెత్తదని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అధికారులతో సమీక్ష తర్వాత కేజ్రీవాల్ ఏమన్నారంటే..
యమునా నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ తో చర్చించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీకి వరద పరిస్థితులు తలెత్తవని అంచనాలు చెబుతున్నట్లు వెల్లడించారు. యమునా నది 206 మీటర్ల మార్కును దాటిన తర్వాత వెంటనే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. దిల్లీలో జరిగిన మూడు రోడ్ కేవ్-ఇన్ ఘటనలపై విచారణకు ఆదేశించారు. ఒకరిపై ఒకరు వేలెత్తి చూపుకునేందుకు ఇది సమయం కాదని, అన్ని ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు ఉపశమనం కలిగించడానికి కలిసి పని చేయాలని కోరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రోడ్లపై ఉన్న గుంతలను రాళ్లతో పూడ్చాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించాలని ఎన్డీఎంసీని కోరారు.
41 ఏళ్లలో గరిష్ఠ స్థాయిలో వర్షపాతం
దేశ రాజధానిలో 41 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో వర్షపాతం నమోదైంది. దిల్లీలో ఒకేరోజు 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం 1982 తర్వా ఇదే తొలిసారి అని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దిల్లీలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దిల్లీ వాసులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial