Delhi Air Quality: మరింతగా దిగజారిన ఢిల్లీ గాలి నాణ్యత, 231 AQIగా నమోదు
Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దిగజారింది. ఏక్యూఐ 231గా నమోదైంది.
Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మరింతగా దిగజారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 231గా నమోదైంది. శనివారం ఉదయం 9 గంటలకు ఏక్యూఐ 231 వద్ద ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర సర్కారు చర్యలు ప్రారంభించిన మరుసటి రోజే.. ఢిల్లీ గాలి నాణ్యత పూర్ స్థాయికి పడిపోయింది. ఏక్యూఐ 0-50 వరకు ఉంటే ఉత్తమంగా చూస్తారు. ఏక్యూఐ 51-100 ఉంటే సంతృప్తికరం, ఏక్యూఐ 101-200 ఉంటే మోడరేట్, ఏక్యూఐ 201-300 ఉంటే పూర్, ఏక్యూఐ 301-400 ఉంటే వెరీ పూర్, 401-500 ఉంటే తీవ్రంగా పరిగణిస్తారు.
రాజధానిలో గాలి నాణ్యత పేలవంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ చర్యలు ప్రారంభించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో బొగ్గు వాడకాన్ని నిషేధించాలని, కాలుష్య పరిశ్రమలపై కఠినంగా వ్యవహరించాలని జాతీయ రాజధాని ప్రాంతంలోని స్థానిక అధికారులను ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ ఆదేశించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(GRAP) అనే కాలుష్య నియంత్రణ ప్రణాళికలో భాగంగా ఉన్న చర్యలు చేపట్టింది.
GRAP 1వ దశను ప్రారంభిస్తూ.. కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఈ ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణించడాన్ని నిరోధించడానికి కట్టడి చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పుకొచ్చింది. దేశ రాజధాని పరిధిలో గాలి నాణ్యత మరింతగా క్షీణించకుండా ఉండేందుకు రాజధాని పరిధిలో GRAP మొదటి దశను వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.
GRAP చేపట్టే చర్యలను నాలుగు దశలుగా వర్గీకరించారు. స్టేజ్-1 పూర్ (ఏక్యూఐ 201-300), స్టేజ్-2 వెరీ పూర్ (ఏక్యూఐ 301-400), స్టేజ్-3 తీవ్రం (ఏక్యూఐ 401-450), స్టేజ్-4 సివియర్ ప్లస్ (ఏక్యూఐ >450).
అయితే పంజాబ్ లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రారంభించాక ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడాన్ని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఏక్యూఐ స్థాయిలను 6 ప్రదేశాల్లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) కొలుస్తుంది. అక్టోబర్ 6వ తేదీన పంజాబ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా మొత్తం 91 చోట్ల వ్యవసాయ వ్యర్థాలను కాల్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ హార్వెస్టింగ్ సీజన్ లో మొత్తంగా 845 కేసులు వెలుగుచూశాయని అధికారులు తెలిపారు. గత ఆరు రోజుల్లోనే అమృత్‌సర్ జిల్లాలో 345 కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 6వ తేదీన అమృత్‌సర్‌లో 41, తర్న్ తరణ్ లో 15, పాటియాలా 10, సంగ్రూర్ లో 6 ప్రాంతాల్లో పంట వ్యర్థాలను కాల్చిన ఘటనలు నమోదయ్యాయి.
అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ
వాయు కాలుష్యంలో భారత్‌లో ఢిల్లీనే అత్యంత కాలుష్య నగరంగా ఉంది. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు మధ్య కాలంలో వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తే ఢిల్లీలోనే అత్యంత ఎక్కువ కాలుష్యం నమోదైనట్లు పరిశోధనల ఆధారంగా వైల్లడైంది. రెండవ అత్యంత కాలుష్య నగరంగా పట్నా ఉంది. ఆ తర్వాత ముజఫరాబాద్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్, మీరట్, నల్బారి, అసన్‌సోల్, గ్వాలియర్ వరుస స్థానాల్లో ఉన్నాయి. రెస్పిరర్ లివింగ్ సైన్స్ నివేదిక ప్రకారం ఈ విషయం వెల్లడైంది. వీరు సెన్సార్ ఆధారిత నెట్‌వర్క్ సహాయంతో గాలి నాణ్యత, వాతావరణ పరిస్థితులు సహా పలు అంశాలను దృష్టిలోకి తీసుకుని పరిశోధన చేపట్టారు.
భారతదేశంలో అత్యంత స్వచ్ఛమైన గాలి కలిగిన నగరంగా మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్ నిలిచింది. అక్కడ PM2.5 సాంద్రత క్యూబిక్ మీటరుకు 11 మైక్రోగ్రాములు మాత్రమే ఉంది. దీంతో అక్కడ గాలి అత్యంత స్వచ్ఛంగా ఉంది. ఐజ్వాల్ తర్వాత కర్ణాటకలోని చిక్‌మంగుళూరు, హర్యానాలోని మండిఖేరా, కర్ణాటకలోని చామరాజనగర్, మడికేరి, విజయపుర, రాయచూర్, శివమొగ్గ, గడగ్, మైసూర్ నగరాలు ఉన్నాయి. కర్ణాటకలోని ఎనిమిది నగరాల్లో స్వచ్ఛమైన గాలి ఉన్నట్లు వెల్లడైంది.