Plane Crash Tragedies: విమాన ప్రమాదాల్లో నేతల మరణాలు.. సుభాష్ చంద్రబోస్ నుండి విజయ్ రూపానీ వరకు విషాద గాథలు
Air India Plane Crash | అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ దుర్మరణం పాలయ్యారు. నిశ్శబ్ద ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీని అభివర్ణిస్తారు.

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, ఆప్తులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అయితే, ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కరే బతికి బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విమానం మెడికల్ కాలేజీపై పడటంతో 20 మంది వరకు మెడికోలు చనిపోయినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే, ఇలా ప్రమాదంలో ప్రముఖ నాయకులు గతంలోనూ విమాన, హెలికాప్టర్ల ప్రమాదాల్లో చనిపోయిన ఘటనలు ఉన్నాయి.
విమాన ప్రమాదాలు: ప్రముఖ నేతల మరణాలు
- నేతాజీ సుభాష్ చంద్రబోస్: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945, ఆగస్టు 18వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. జపాన్ దేశ ఆర్మీకి చెందిన బాంబర్ విమానంలో ఆయన మంచూరియాకు వెళ్లాలని భావించారు. ఈ విమానంలో ఇంపీరియల్ జపనీస్ క్వాంటుంగ్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్ సునామాసా షిడేయి (Lt. Gen. Tsunamasa Shidei) తో పాటు ఇతర జపనీస్ సైనికాధికారులు కూడా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మంచూరియాకు వెళ్లేందుకు తైహోకు (ప్రస్తుత తైపీ) నుండి టోక్యోకు బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇది మన దేశ చరిత్రలోనే గొప్ప నాయకుడిని కోల్పోయిన విమాన ప్రమాద ఘటనగా చెప్పవచ్చు.
- సంజయ్ గాంధీ: 1980 జూన్ 23న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ చనిపోయారు. ఆయన స్వయంగా విమానం నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందిర రాజకీయ వారసుడిగా ఆనాడు భావించిన సంజయ్ గాంధీ ఈ ప్రమాదంలో చనిపోవడం సంచలనం సృష్టించింది.
- ఎస్. మోహన్ కుమారమంగళం: 1973 మే 31వ తేదీన ఢిల్లీ సమీపంలో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంలో కేంద్ర మంత్రి ఎస్. మోహన్ కుమారమంగళం మరణించారు. ఆయన గొప్ప విద్యావేత్త. కేంద్ర గనుల శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో గనులను జాతీయం చేసిన వ్యక్తిగా పేరు పొందారు. మంచి రాజకీయ నేతగా గుర్తింపు ఉంది.
- మాధవరావు సింధియా: 2001 సెప్టెంబర్ 30వ తేదీన కాన్పూర్ బహిరంగ సభలో ప్రైవేట్ విమానంలో వెళ్తుండగా కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా మరణించారు. మాధవరావు సింధియా కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. అటల్ బిహారీ వాజ్‌పేయిని ఓడించిన ఘనతను దక్కించుకున్న నేత మాధవరావు సింధియా. ఒక్కసారి కూడా ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది. విమాన ప్రమాదంలో మరణించిన ఆయన పీవీ నరసింహారావు క్యాబినెట్‌లో పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పని చేశారు.
- జీఎంసీ బాలయోగి: 2002 మార్చి 3వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి మరణించారు. భీమవరం నుండి తిరిగి వస్తుండగా హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి హెలికాప్టర్ కుప్పకూలింది. ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌గా పని చేసి ఆ తర్వాత రాజకీయాల్లో రాణించిన గొప్ప వ్యక్తి. భారతదేశ చరిత్రలో తొలి దళిత స్పీకర్‌గా ఆయనకు గుర్తింపు ఉంది. అంతేకాదు, లోక్‌సభ చరిత్రలో 46 ఏళ్లకే స్పీకర్ పదవిని అలంకరించిన యువ స్పీకర్‌గా ఆయనకు గుర్తింపు ఉంది.
- ఓం ప్రకాశ్ జిందాల్: 2005 మార్చి 31న హెలికాప్టర్ ప్రమాదంలో హర్యానా మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఓం ప్రకాశ్ జిందాల్ మరణించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు హర్యానా వ్యవసాయ మంత్రి సురేంద్ర సింగ్ కూడా మృతి చెందిన వారిలో ఉన్నారు. ఓపీ జిందాల్ పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. జిందాల్ స్టీల్, సిమెంట్ వంటి దిగ్గజ వ్యాపారవేత్తగా గుర్తింపు ఉంది. ఇక సురేంద్ర సింగ్ మాజీ సీఎం బన్సీలాల్ కుమారుడు.
- సురేంద్రనాథ్: 1994 జూలై 9న విమాన ప్రమాదంలో పంజాబ్ మాజీ గవర్నర్ సురేంద్రనాథ్, ఆయన కుటుంబ సభ్యులు 12 మంది మరణించారు. ఆయన చండీగఢ్ నుండి హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు అనే పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం కుల్లు విమానాశ్రయంతో సంబంధాలు తెగిపోయి, ఆ తర్వాత విమానం కుప్పకూలింది.
- డేరా నాటుంగ్: 2001 మేలో హెలికాప్టర్ ప్రమాదంలో అరుణాచల్ ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి డేరా నాటుంగ్ మరణించారు. విద్యారంగ సంస్థలకు స్థలం చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన విద్యారంగానికి విశిష్ట సేవలు అందించారు.
- సిప్రియన్ ఆర్. సంగ్మా: 2004 సెప్టెంబర్‌లో మేఘాలయకు చెందిన ప్రముఖ నేత, మేఘాలయ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రి సిప్రియన్ ఆర్. సంగ్మా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
- బల్వంత్రాయ్ మెహతా: 1965 సెప్టెంబర్‌లో ఇండో-పాక్ యుద్ధం సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న బల్వంత్ రాయ్ మెహతా విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసింది. గుజరాత్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరలో ఉన్న మిఠాపూర్ నుండి ద్వారకకు ఒక ఇండియన్ సివిల్ బీచ్‌క్రాఫ్ట్ విమానంలో బల్వంత్ రాయ్ మెహతా వెళ్తున్నారు. ఈ విమానాన్ని పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-86 సాబ్రే జెట్ విమానం గుర్తించి, సరిహద్దు దాటుతున్న భారత యుద్ధ విమానంగా పొరపాటు పడి దాడి చేసి కూల్చివేసింది. ఈ ఘటన అప్పుడు చాలా సంచలనం అయింది. బల్వంత్ రాయ్ మెహతా స్వాతంత్ర్య సమరయోధుడు. అంతేకాదు, గొప్ప రాజకీయవేత్తగా, పంచాయితీ రాజ్ పితామహుడిగా పేరు పొందారు. 1957లో నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'బల్వంతరాయ్ మెహతా కమిటీ'కి ఆయన అధ్యక్షత వహించారు. స్థానిక స్వపరిపాలన సంస్థలను మూడు అంచెలుగా (గ్రామ పంచాయతీ, బ్లాక్ సమితి, జిల్లా పరిషత్) ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల వల్లే నేడు పంచాయతీ వ్యవస్థ సమర్థవంతంగా నడుస్తోందని రాజకీయ వేత్తలు చెబుతారు.
- వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి: 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో, రుద్రకొండ కొండ సమీపంలో, చిరుత గుండం తిప్ప అనే ప్రదేశంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రాంతం పావురాల గుట్టకు దగ్గరగా ఉంటుంది. ఆయనతో పాటు ఐదుగురు మరణించారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసిన నేతగా తెలుగు ప్రజలు గుర్తిస్తారు.
- దోర్జీ ఖండూ: 2011 ఏప్రిల్ 30వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. పర్వత ప్రాంతంలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తవాంగ్ నుండి ఈటానగర్ వెళ్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. ఏప్రిల్ 30వ తేదీన అదృశ్యమైన హెలికాప్టర్ శకలాలు 2011 మే 4వ తేదీన కనుగొన్నారు. దోర్జీ ఖండూకు ప్రజల ముఖ్యమంత్రిగా గొప్ప పేరుంది. ఆయన ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ కార్ప్స్‌లో గూఢచారిగా ఏడేళ్లు సేవలందించారు. 1971లో జరిగిన బంగ్లా విముక్తి యుద్ధంలో గూఢచారిగా ఆయన అందించిన సేవలకు ప్రభుత్వం బంగారు పతకం ఇచ్చి సత్కరించింది.
- ఇక తాజాగా, 2025 జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీదుర్మరణం పాలయ్యారు. ఈయన ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న నాయకుడిగా గుర్తింపు ఉంది. రెండు పర్యాయాలు గుజరాత్‌కు సీఎంగా పని చేశారు. ప్రజలు కేంద్రంగా 1800 నిర్ణయాలు తీసుకున్నారని ఆయనకు పేరు. నిశ్శబ్ద ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీని అభివర్ణిస్తారు. మాటలతో కాకుండా చేతల సీఎంగా పేరుంది.
ఇలా విమాన ప్రమాదాలు భారతీయ రాజకీయ చరిత్రలో ఎందరో గొప్ప నేతలను కోల్పోయేలా చేశాయి. ఇలాంటి గొప్ప నేతల దుర్మరణం దేశంలో విషాదం నింపడమే కాదు, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.






















