Covid-19: కోవిడ్‌తో జీవించాల్సిందే... భారత్‌లో స్థానిక స్టేజ్‌లోకి కరోనా.. వారికి ముప్పు తప్పదు.. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్
భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ షాకింగ్ విషయాలు తెలిపారు. ఇకపై మనం కరోనాతో కలిసి జీవించాల్సిందేనని చెప్పారు.
ఏడాదిన్నర కాలం నుంచి ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను సైతం కలవరపెడుతున్న కోవిడ్19 మహమ్మారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. భారతదేశంలో కోవిడ్.. స్థానిక (endemic) స్టేజ్‌లోకి వచ్చేసిందని వ్యాఖ్యానించారు. ఇకపై మనం కరోనా వ్యాధితో కలిసి జీవించాల్సిందేనని తెలిపారు.
అమెరికాలోని సెంటర్స్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించిన ప్రకారం.. ఒక భౌగోళిక ప్రాంతంలోని జనాభా ఒక వ్యాధితో కలిసి జీవించాల్సిన స్థితిని ఎండమిక్ స్టేజ్ అంటారు. విదేశాల నుంచి ఏదైనా ఒక వ్యాధి వస్తే దాని వ్యాప్తి కొన్నాళ్లకు ఆగిపోతుంది. ఆ వ్యాధి స్థానిక స్టేజ్‌లోకి వస్తే దాని వ్యాప్తి ఎప్పటికీ ఆగదని అర్థం. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటివి మనకు ఎలా రెగ్యులర్ వ్యాధులుగా ఉన్నాయో.. కరోనా కూడా అలానే ఉండనుంది. ఏదోక రూపంలో చెప్పుకోతగ్గ స్థాయిలో వ్యాధి వ్యాపిస్తూనే ఉంటుందని సెంటర్స్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.
వ్యాప్తి కాస్త తక్కువగానే..
ఇండియాలో స్థానిక స్టేజ్‌లోకి వచ్చినా.. వ్యాధి వ్యాప్తి కాస్త తక్కువగానే ఉందని సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యానించారు. కొన్ని నెలల క్రితంతో పోలిస్తే కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు, ఇది కాస్త ఉపశమనం కలిగించే అంశమని తెలిపారు. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో విభిన్న జనాభా ఉంటారని.. ఇది చాలా పెద్ద దేశమని, అన్ని ప్రాంతాల్లో జనాభా ఒకేలా ఉండే అవకాశం లేదన్నారు. రోగ నిరోధక శక్తి ఆధారంగా వ్యాధి తీవ్రతలో హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పారు.
వారికి ప్రమాదం ఎక్కువ..
కోవిడ్ మొదటి, రెండో దశల్లో వ్యాధి బారిన పడని వారితో పాటు వ్యాక్సినేషన్ వేయించుకోని వారు రాబోయే నెలల్లో జాగ్రత్తగా ఉండాలని సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. వీరికి కోవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆమె అంచనా వేశారు. పండుగలు వ్యాధికి వాహకాలుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటీవల కేరళలో జరిగిన ఓనమ్ పండుగను ఆమె ఉదహరించారు.
ఓనమ్ పండుగ కారణంగా ఎక్కువ మంది ఒకచోట చేరారని.. దీంతో కోవిడ్ కేసులు అమాంతం పెరిగాయని సౌమ్య స్వామినాథన్ చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాలను పరిశీలిస్తున్నామని.. దానిని బట్టి ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇటీవల కాలంలో డెల్టా వేరియంట్ కేసులు వచ్చాయని.. ఇది తాము ముందుగానే అంచనా వేసినట్లు వెల్లడించారు. వ్యాధి వ్యాప్తికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై మరో ఫిర్యాదు, మారకపోతే ప్రత్యక్ష దాడులే.. టీఆర్ఎస్ హెచ్చరిక