Corona Cases: దేశంలో కొత్తగా 10 వేల కరోనా కేసులు, భారీగా పెరిగిన రికవరీ రేటు
Covid Cases In India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజువారీగా దాదాపు 10 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
Corona Cases In India: దేశంలో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 10 వేలు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే పాజిటివ్ కేసులు దాదాపు అంతే నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజు భారత్‌లో 10,273 (10 వేల 2 వందల 73) మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డైలీ పాజిటివిటీ రేటు 1 శాతానికి దిగొచ్చింది. కొవిడ్ 19 రికవరీ రేటు ఏకంగా 98 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,11,472 (1 లక్షా 11 వేల 4 వందల 72) మంది కరోనాకు చికిత్స (Active Corona Cases In India) తీసుకుంటున్నారు.
తాజాగా 243 కరోనా మరణాలు
శనివారం ఒక్కరోజులో 20,439 (20 వేల 439) మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. వారితో కలిపితే భారత్‌లో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,22,90,921 (4 కోట్ల 22 లక్షల 90 వేల 921)కు చేరింది. అదే సమయంలో కొవిడ్ తో పోరాడుతూ 243 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. కిందటి రోజుతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నిలకడగా ఉన్నాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,13,724 (5 లక్షల 13 వేల 724)కు చేరినట్లు పేర్కొంది.
177 కోట్ల డోసుల వ్యాక్సిన్..
గత ఏడాది జనవరి (2021)లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభించినప్పటి నుంచి ఆదివారం ఉదయం వరకు దేశంలో 1,77,44,08,129 (177 కోట్ల 44 లక్షల 8 వేల 129) డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.26 శాతంగా ఉన్నాయని కేంద్ర వైద్యశాఖ తెలిపింది.
ఏపీలో తగ్గిన కరోనా వ్యాప్తి..
ఏపీలో కరోనా కేసులు(Corona Cases) భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15,213 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 141 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ముగ్గురు మరణించారు.