Akhilesh Yadav: కాంగ్రెస్ పార్టీ కాదు కన్నింగ్ పార్టీ, జాగ్రత్తగా ఉండాలి - అఖిలేశ్ యాదవ్
Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(SP) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ‘ఇండియా’(I.N.D.I.A) కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ మహామోసకారి అని ఆరోపించారు.
Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(SP) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ‘ఇండియా’(I.N.D.I.A) కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహా మోసకారి అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గానీ, బీజేపీకి గానీ ఓటేయరాదని ఓటర్లను ఆయన కోరారు. ఈ రెండు పార్టీలు ప్రకటించిన పథకాలు, హామీలు అమలయ్యేవి కావని చెప్పారు. కేవలం ఓట్ల కోసమే కుల గణనకు మద్దతు ఇస్తోందని విమర్శించారు.
అడ్డుకుంది కాంగ్రెస్, బీజేపీలే
మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘రేషన్ అందనప్పుడు బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు? కాంగ్రెస్‌కు కూడా ఓటు వేయొద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ కుటిల పార్టీ అని, ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ కులగణన అంటోందని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీయే కుల ఆధారిత సర్వేను నిలిపివేసిందని గుర్తు చేశారు. మండల్ కమిషన్ సిఫారసులకు కూడా కాంగ్రెస్ అడ్డుపుల్ల వేసిందని, బీజేపీ కూడా అదే దారిలో వెళ్తోందని విమర్శించారు.
బీజేపీది లూటీ స్వామ్యం
కుల గణన కోసం డిమాండ్లు తీవ్రం కావడంతో కాంగ్రెస్ తాము చేపడతామని చెబుతోందని, బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించే బీజేపీ కూడా కుల గణన గురించి మాట్లాడుతోందని ఆరోపించారు. మహిళల భద్రతపై మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో మహిళలు ముఖ్యంగా ఆదివాసీ, దళిత మహిళలు ఎంతో అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. బీజేపీ నమ్మేది ప్రజాస్వామ్యాన్ని కాదు, లూటీ స్వామ్యాన్ని అని విమర్శలు చేశారు.
అలా అయితే ఎప్పటికి గెలవలేరు
కాంగ్రెస్ తమకు మధ్యప్రదేశ్‌లో సీట్లు ఇవ్వకూడదనుకుంటే వారు ముందే చెప్పాలని, తాము మధ్యప్రదేశ్‌లో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. I.N.D.I.A కూటమి సార్వత్రిక ఎన్నికల కోసమే అని గ్రహించాలని, కానీ కాంగ్రెస్ ఇలాగే వ్యవహరిస్తే వారితో ఏ పార్టీ నిలబడుతుందని ప్రశ్నించారు. కూటమిలో ఇంత గందరగోళం, సందేహాలు పెట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే ఎప్పటికీ విజయం సాధించలేరని అన్నారు.
కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వమని కోరిన అజయ్ రాయ్
అంతకు ముందు కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్ మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీ మధ్యప్రదేశ్ ఎన్నికల నుంచి వైదొలగాలని సూచించారు. దేశం మొత్తం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ఎన్నికల నుంచి ఎస్పీ తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇండియా కూటమిలో ఉన్న వారు పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. మధ్యప్రదేశ్‌లో ఎస్పీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండేవాడని ఆయన కూడా బీజేపీలో చేరారని గుర్తు చేశారు.
అసలు రచ్చ ఎందుకు?
2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ధీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో ప్రతిపక్షాలతో ఏర్పాటైన ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఎస్‌పీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కొన్ని సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ పక్కన పెట్టింది. దీంతో ఆగ్రహించిన సమాజ్‌వాదీ పార్టీ సొంతంగా అభ్యర్థులను బరిలోకి దించింది. మొత్తం 72 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఈ వ్యవహారంలో రెండు పార్టీల మధ్య విభేదాలు ముదిరాయి.