Rahul Gandhi : ఆర్థిక స్థితితో సంబంధం ఏంటి.. రిజర్వేషన్లు కులం ఆధారంగానే కొనసాగాలి: రాహుల్
Congress: భారత దేశంలో ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా కులం ఆధారంగానే రిజర్వేషన్లు కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు
Rahul Comments On Reservations: అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశానికి సంబంధించిన కీలకాంశాలపై రెండు మూడు రోజుల నుంచి సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. దేశంలో ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా కులం ఆధారంగానే రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. ఆర్థిక పరమైన అంశాలు చిన్నవని కులం ఆధారంగానే దేశంలో వివక్ష కొనసాగుతోందని ఆయన చెప్పారు. బీసీ కోటాను 50 శాతానికి పరిమితం చేస్తూ విధించిన క్యాప్‌ను ఎత్తేయాలన్నదే తన డిమాండ్‌గా అమెరికా పర్యటనలో ఆయన వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. వాషింగ్టన్‌లో నేషనల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఒక ముఖాముఖిలో పాల్గొన్నారు.
భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లో ఉంది:
అమెరికాలో నరేంద్రమోదీ సర్కారు లక్ష్యంగా రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గడచిన పదేళ్లలో భారత్‌లో ప్రజాస్వామ్యం ముక్కలైందని అన్నారు. సిరియా, ఇరాక్ తరహా పరిస్థితులను ఎదుర్కొంటూ తాము రాజకీయం చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి తాము ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ కమలనాథులు కూలదోస్తూనే ఉన్నారన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడమే ఇందుకు ఉదాహరణగా ఆయన వివరించారు. ఈ ప్రజాస్వామ్యయుత పోరాటంలో ఓటరే తమను నడిపిస్తాడని రాహుల్ అన్నారు. తనపై 20 అక్రమ కేసులు బనాయించారన్న ఆయన.. పరువు నష్టం కేసుల్లో గరిష్ఠ శిక్ష ఎదుర్కొన్న వాడిని తానేనని.. ఇప్పటికీ ఓ ముఖ్యమంత్రి అక్రమ విధానంలో అరెస్టై జైలులో మగ్గుతునారన్నారు. చైనా ఓ వైపు నుంచి భారత్‌పై దురాక్రమణ చేస్తుంటే దేశంలో మాత్రం వీళ్లు ఈ తరహా విధానాలతో వెళ్తున్నారని మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
ఓబీసీ కోటా క్యాప్ ఎత్తేయాల్సిందే.. కులగణన అత్యవసరం:
దేశంలో కులగణన తప్పనిసరిగా చేపట్టాల్సి ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. అత్యధిక వర్గాలు ప్రభుత్వంలో భాగం కాలేక పోతున్నాయన్న ఆయన.. కులగణన చేసి ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి తీరాలని అమెరికాలో అన్నారు. ఇది మండల్ వర్సెస్ కమండల్ సమస్య కాదని.. దేశ ప్రజల పురోగతికి సంబంధించిన అంశమని ఓబీసీ కోటాపై స్పందించారు. ఓబీసీ కోటా విషయంలో తను వ్యతిరేకంగా ఉన్నట్లు అధికార పక్షం తప్పుడు ప్రచారం చేస్తోందన్న రాహుల్.. అప్పుడూ ఇప్పుడు ఎప్పుడూ తను ఓబీసీ కోటాపై క్యాప్ ఎత్తేయాలనే డిమాండ్ చేస్తున్నానని అన్నారు. 50 శాతం కోటాపై క్యాప్ ఎత్తేయాలని పునరుద్ఘాటించిన రాహుల్.. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రిజర్వేషన్ల అమలుతోనే సాంఘిక పరమైన డిఫరెన్సెస్ పోతాయని.. ఆర్థిక అంశాలు ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదన్నారు. రిజర్వేషన్ల ద్వారానే వారికి సరైన ప్రాతినిధ్యం ప్రాధాన్యత వస్తాయన్న ఆయన.. వెనుకబడిన వర్గాల పురోగతిలో రిజర్వేషన్లు ఒక భాగం మాత్రమేనని వ్యాఖ్యానించారు. దేశం పూర్తి స్థాయిలో పురోగతి సాధించిన తర్వాతే రిజర్వేష్ల రద్దు గురించి చర్చించాలన్న రాహుల్.. ఇప్పుడు రద్దు విషయంపై చర్చ సరికాదన్నారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులకు సంబంధించి అమెరికా చట్టసభ్యులతో చర్చించామన్న రాహుల్.. అక్కడి మైనారిటీలకు భద్రత విషయంలో యూనస్ సర్కారు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇజ్రాయెల్, గాజా తదితర ప్రాంతాల్లో హింసకు తాము వ్యతిరేకమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.