Vantara Statement: జంతువుల సంరక్షణ, పునరావాసం మా లక్ష్యం, సిట్ దర్యాప్తునకు సహకరిస్తాం- వంతారా రెస్క్యూ సెంటర్
Vantara Statement: జంతువుల సంరక్షణ, పునరావాసం పారదర్శకంగానే కొనసాగిస్తూనే, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తునకు సహకరిస్తాం అని వంతారా రెస్క్యూ సెంటర్ స్పష్టం చేసింది.

Supreme Court forms SIT on Vantara Center | న్యూఢిల్లీ: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న వంతారా జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం (Vantara Rescue and Rehabilitation Centre)పై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ఆదేశించడం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలపై వంతారా వన్యప్రాణి రెస్క్యూ సెంటర్ స్పందించింది. తాము చట్టానికి కట్టుబడి ఉంటామని, సిట్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాం అని వంతారా రెస్క్యూ సెంటర్ స్పష్టం చేసింది.
పారదర్శకత ముఖ్యమన్న వంతారా రెస్క్యూ సెంటర్
వంతారా జంతు సంరక్షణ, పునరావాస కేంద్రంపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడంపై సంస్థ స్పందించి ఓ ప్రకటన విడుదల చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాన్ని మేము అత్యంత గౌరవంతో స్వీకరిస్తున్నాం. వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అత్యంత పారదర్శకత, దయాగుణంతో వ్యవహరిస్తుంది. అదే సమయంలో చట్టానికి పూర్తి విధేయతతో ఉంటుంది. సిట్ దర్యాప్తునకు వంతారా పూర్తిగా సహకరిస్తుంది. అదే సమయంలో జంతువుల పరిరక్షణ, వాటి పునరావాసంపై మా సేవలు యథాతథంగా కొనసాగిస్తాం. జంతువులను రక్షించడం, పునరావాసం కల్పించడం మా లక్ష్యం. అందుకోసం మేం నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని ఆ ప్రకటనలో వంతారా టీమ్ స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో వంతారాపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం నాడు SITను ఏర్పాటు చేసింది.
ప్రత్యేక దర్యాప్తు బృందానికి అన్ని విధాలా సహకరిస్తాం. జంతువుల సంక్షేమం, వాటి నిర్వహణే మాకు ముఖ్యం. ఆ దిశగానే మా ప్రయత్నాలుంటాయి. ఆ దర్యాప్తునకు సంబంధించి ఎలాంటి ఊహాగానాలకు తావివ్వాలని తాము భావించడం లేదని, జంతువుల బాగోగులు కొనసాగిస్తామని’ సంస్థ పేర్కొంది.
అసలు వివాదం ఏంటి..
గుజరాత్‌లోని జామ్నగర్ వంతారా వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రంలో జంతువులను అక్రమంగా తీసుకువస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వంతారాకు తీసుకువచ్చిన జంతువులను తమ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని CR జయ సుకిన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఏనుగులు, పక్షులు, ఇతర జంతువులను వంతారలోకి అక్రమంగా తరలించి ఉంచుతున్నారని దాఖలైన పిటిషన్‌లో వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు భావించింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం దర్యాప్తు చేయడానికి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. సెప్టెంబరు 12లోగా దర్యాప్తును పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబరు 15కు వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ వన్యప్రాణుల సంరక్షణ చట్టాలకు సంబంధించి, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు, జంతు సంక్షేమ ప్రమాణాలతో పాటు పర్యావరణ అంశాలను అన్ని విధాలుగా పరిశీలించి సుప్రీంకోర్టు ధర్మాసనానికి తమ నివేదిక ఇవ్వనుంది.
దేశ విదేశాల నుంచి జంతువులను అక్రమంగా కొనుగోలు చేయడంతో పాటు వంతారాలో వాటి నిర్వహణ సరిగ్గా లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. మనీ లాండరింగ్ఆరోపణలతో సైతం మరో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్లు విచారించిన సుప్రీం ధర్మాసనం వంతార సెంటర్ పై సిట్ దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికి తీయాలని ఆదేశాలిచ్చింది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌లో తెలంగాణ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, అడిషనల్ కమిషనర్ (కస్టమ్స్) అనీష్ గుప్తా, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే సభ్యులుగా ఉన్నారు.






















