(Source: ECI/ABP News/ABP Majha)
11 రాష్ట్రాల్లో సెరో టైప్-2 డెంగ్యూ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం.. జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా..
సెరో టైప్-2 డెంగ్యూ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇతర వ్యాధులతో పోల్చి చూస్తే సెరో టైప్-2 డెంగ్యూ కేసుల సమస్య ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రస్తుతం కొవిడ్-19 పరిస్థితి, టీకాల కార్యక్రమంపై కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు పాల్గొన్నారు. కొవిడ్ తాజా పరిస్థితిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలను సమగ్రంగా చర్చించారు.
కొవిడ్ పట్ల ఎలాంటి అలసత్వం ప్రదర్శించొద్దని కేబినెట్ కార్యదర్శి సూచించారు. కొవిడ్ నియంత్రించేందుకు మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని చెప్పారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించడం పట్ల కేబినెట్ కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ రాష్ట్రాల్లో సమస్య ఎక్కువగాఉంది
డెంగ్యూ విజృంభనపైనా ఈ సమావేశంలో చర్చించారు. సెరో టైప్-2 డెంగ్యూ కేసుల పట్ల 11 రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి చెప్పారు. ఇతర వ్యాధులతో పోల్చి చూస్తే ఈ రాష్ట్రాల్లో సెరో టైప్-2 డెంగ్యూ కేసుల సమస్య ఎక్కువగా ఉందన్నారు. సెరో టైప్-2 డెంగ్యూ కేసులను ముందుగానే గుర్తించడానికి చర్యలు తీసుకోవాలని సూచించిన ఆరోగ్య శాఖ కార్యదర్శి దీనికోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష సదుపాయాలను మెరుగు పరచడానికి, అవసరమైన ఔషధాలను సమీకరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
జాగ్రత్తలపై వివరించాలి
వ్యాధిని గుర్తించడానికి సర్వే నిర్వహించి, వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించాలని చెప్పారు రక్తం ముఖ్యంగా ప్లేట్‌లెట్స్ తగినంత నిల్వలను నిల్వ చేయాలని బ్లడ్ బ్యాంక్‌లకు సూచనలు జారీ చేయాలని ఆయన అన్నారు. వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అమలు చేస్తున్న నివారణా చర్యలను ప్రజలకు వివరించడానికి ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. డెంగ్యూ వ్యాపించ కుండా ఇళ్లలో తీసుకోవలసి జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.
సెరో టైప్-2 డెంగ్యూ కేసులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్,కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి.
70 జిల్లాల్లో పరిస్థితి అధికం
కరోనాతో 15 రాష్ట్రాలలోని 70 జిల్లాలో పరిస్థితి ఆందోళన కలిగించే విధంగా ఉందని ఆరోగ్య కార్యదర్శి అన్నారు. ఈ 70 జిల్లాల్లోని 34 జిల్లాలు పాజిటివిటీ శాతం 10కి మించి ఉందని, మిగిలిన జిల్లాల్లో ఇది 5 నుంచి 10 శాతం వరకు ఉందని అన్నారు. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అన్ని జిల్లాల్లో పరిస్థితిని గమనిస్తూ వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడడానికి అవసరమైన ఆంక్షలను నిబంధనలకు అనుగుణంగా విధించాలని అన్నారు.