CBI Raids: లాలూ యాదవ్‌కు మరో షాక్- కొత్త అభియోగాలు మోపిన సీబీఐ
CBI Raids: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ కొత్త కేసు పెట్టింది. లాలూ, ఆయన కుమార్తె ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది.
CBI Raids: ఆర్‌జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె ఇళ్లలో సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) శుక్రవారం సోదాలు చేసింది. అవినీతిపై లాలూప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమార్తెలపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. లాలూకు సంబంధించి సీబీఐ శుక్రవారం 15 చోట్ల సోదాలు నిర్వహించింది.
ఇదే కేసు
2004-2009 మధ్యకాలంలో లాలూ ప్రసాద్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైల్వే శాఖకు చెందిన ఉద్యోగ నియామకాల్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ తాజాగా అభియోగాలు మోపింది.
వీటి ఆధారాల కోసం ఒకేసారి లాలూ ప్రసాద్ ఇంటితో పాటుగా రాష్ట్రీయ జనతాదళ్‌కు సంబంధించిన 15 ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ కేసులో లాలూ కుటుంబ సభ్యులకు కూడా పాత్ర ఉందని వారిని నిందితులుగా పేర్కొంది. ఈ కేసులో రైల్వే ఉద్యోగాలు ఇప్పించేందుకు లాలూ, అతని కుటుంబ సభ్యులు డబ్బుకు బదులుగా భూమి, ఆస్తులను లంచంగా అందుకున్నారని సీబీఐ ఆరోపించింది.
మరో కేసులో
దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధిస్తూ ఇటీవల రాంచీ కోర్టు తీర్పు ఇచ్చింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. దోరండా ఖజానా నుంచి రూ.139.35కోట్లు దుర్వినియోగం కేసు ఐదోది, చివరిది. ఈ కేసులో మొత్తం 170 మంది నిందితులు కాగా.. 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వం తరఫున సాక్షులుగా మారారు. ఇద్దరు నేరం అంగీకరించారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. చివరకు లాలూ సహా మొత్తం 99 మంది నిందితులపై ఫిబ్రవరి నుంచి విచారణ జరిపింది రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.
Also Read: Covid-19 Cases India: దేశంలో కొత్తగా 2259 కరోనా కేసులు- 20 మంది మృతి
Also Read: Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు