LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు
National News: బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ శనివారం అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్చారు.
LK Advani Admitted To Hospital: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ (97) (LK Advani) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న అద్వానీ గత కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు. గతంలోనూ ఇలాగే అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినా.. వెంటనే కోలుకున్నారు. యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యాక అద్వానీ మీడియా ముందుకు రావడం చాలా అరుదు. అయోధ్య రామ మందిర ప్రారంభానికి ఆహ్వానం అందినప్పటికీ వయసు రీత్యా ఇబ్బందులతో ఆయన హాజరుకాలేకపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన తర్వాత కూడా ప్రధాని మోదీయే అద్వానీ నివాసానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.
Also Read: Lookback 2024: రాబోయే సంచలనాలకు 2024 పునాది - 2025లో జమిలీ ఎన్నికలపై కీలక మలుపులు !