ముస్లిం స్పీకర్ ముందు బీజేపీ నేతలు చేతులు కట్టుకుంటున్నారు, ఈ ఘనత కాంగ్రెస్‌దే - కర్ణాటక మంత్రి
Karnataka Minister: ముస్లిం స్పీకర్ ముందు బీజేపీ నేతలు చేతులు కట్టుకుని నిలుచుంటున్నారని కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Karnataka Minister Zameer Ahmed Khan:
కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు..
కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ (Zameer Ahmed Khan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్టాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖదీర్‌కి బీజేపీ నేతలు బలవంతంగా అయినా గౌరవం ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఓ ముస్లింకి బీజేపీ నేతలు చాలా గౌరవంగా నమస్కారం చెబుతున్నారంటే అదంతా కాంగ్రెస్ ఘనతే అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో చాలా మంది ముస్లింలకు మంచి పదవులు వచ్చాయని, పార్టీలో మంచి పొజిషన్‌లో ఉన్నారని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 17 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపింది. వీరిలో 9 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరో 5గురికి పార్టీలో మంచి పదవులు ఇచ్చింది హైకమాండ్. దీన్ని దృష్టిలో పెట్టుకునే జమీర్ అహ్మద్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇవాళ కర్ణాటక అసెంబ్లీలో ఓ ముస్లిం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేపీ నేతలంతా లేచి నిలబడి ఆయనకు నమస్కారం సర్ అని చెప్పాల్సి వస్తోంది. ఇదంతా కాంగ్రెస్ వల్లే సాధ్యమైంది. కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు సరైన గౌరవం లభిస్తోంది. నాతోపాటు మరో ఇద్దరు ముస్లింలకు కీలక పదవులు ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు అసెంబ్లీకి ఓ ముస్లిం స్పీకర్‌ని ఎప్పుడూ నియమించలేదు. ఇప్పుడు బీజేపీ అదే ముస్లిం స్పీకర్‌ని గౌరవించాల్సి వస్తోంది"
- జమీర్ అహ్మద్ ఖాన్, కర్ణాటక మంత్రి
శీతాకాల సమావేశాలు..
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బెలగావిలో డిసెంబర్ 4-15 వరకూ సువర్ణ సౌధలో (Suvarna Soudha) శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపే అవకాశముంది. ఇప్పటికే ఈ కామెంట్స్‌పై JDS తీవ్రంగా స్పందించింది. హెచ్‌డీ కుమార స్వామి అసహనం వ్యక్తం చేశారు. ఇంత దిగజారిపోయి మాట్లాడతారని ఊహించలేదని అన్నారు. ఈ ఏడాది జులైలో అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖదీర్ (UT Khader) 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో క్రమశిక్షణతో ఉండలేదన్న కారణం చూపిస్తూ వాళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు.
"మంత్రి జమీద్ ఇంత దిగజారిపోయి మాట్లాడతారని ఊహించలేదు. ఈ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ బీజేపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోతే పరిస్థితేంటి..? కాస్తైనా ఆలోచించారా..? ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కొంతైనా జ్ఞానం ఉంటే జమీద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి"
- హెచ్‌డీ కుమారస్వామి, జేడీఎస్ చీఫ్
హిజాబ్‌పై నిషేధం లేదు..
కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హిజాబ్‌లపై నిషేధం (Ban on Hijab) ఉండదు అని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో హిజాబ్‌ని నిషేధించే ఆలోచనే ఏమీ లేదని తేల్చి చెప్పింది. కర్ణాటక విద్యాశాఖ హిజాబ్‌పై నిషేధం విధించిందన్న వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వమే అధికారికంగా ఈ ప్రకటన చేసింది. అలాంటి నిషేధం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. కొత్త నిబంధనల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, మాల్‌ప్రాక్టీసింగ్‌ని కట్టడి చేయడం తప్ప మరే విధమైన ఆంక్షలు విధించాలన్న ఆలోచన లేదని తెలిపింది. కొత్త ఎగ్జామ్ రూల్స్ అంటూ ఏమీ లేవని, పాత నిబంధనలే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Also Read: నేనెప్పుడూ గార్బా డ్యాన్స్ చేయలేదు, అలాంటి వీడియోలు చాలా ప్రమాదకరం - డీప్‌ఫేక్‌పై ప్రధాని అసహనం