Babul Supriyo Quits Politics: బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం... రాజకీయాలకు గుడ్ బై, ఇంకా ఏమన్నారంటే
కేంద్ర మాజీ మంత్రి, బెంగాల్ బీజేపీ ఫైర్‌బ్రాండ్ బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు శనివారం ప్రకటించారు.
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇకపై సామాజిక సేవపై దృష్టిపెట్టనున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రివర్గం నుంచి బాబుల్‌ను తొలగించిన కొద్ది రోజులకే ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
తాను టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం.. ఇలా ఏ పార్టీలోకి వెళ్లడం లేదని బాబుల్ సుప్రియో స్పష్టం చేశారు. ఆయా పార్టీల్లోకి రమ్మని తనను ఎవరూ ఆహ్వానించలేదన్నారు. తాను ఒకే టీం ప్లేయర్‌నన్న ఆయన... ఎప్పటికీ ఒకే పార్టీ (బీజేపీ)లో ఉంటానని తెలిపారు. తన వల్ల కొంతమంది సంతోషపడ్డారని, మరికొందరు బాధపడ్డారని చెప్పారు. ఎన్నో సుదీర్ఘ చర్చల అనంతరం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల నుంచి ఇక తాను వైదొలుగుతున్నానని, రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం సాధ్యం కాదన్నారు. తనను అపార్థం చేసుకోవద్దని ఆయన ఫేస్ బుక్ ఖాతాలో బెంగాలీలో రాసుకొచ్చారు.
ప్రముఖ గాయకుడైన బాబుల్ సుప్రియో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. మోదీ హయంలో తొలిసారి ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి కూడా ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కింది.
అయితే ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో బాబుల్ కూడా బరిలోకి దిగారు. అయితే టీఎంసీ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనపై బీజేపీ నాయకత్వం కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగగా.. 12 మంది మంత్రులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. అందులో బాబుల్ కూడా ఉన్నారు. మరోవైపు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో బాబుల్ కు విభేదాలు మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో బాబుల్ పార్టీని వీడుతున్నట్టు గత కొంతకాలం నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు స్వయంగా ఆయనే ప్రకటించారు.
Also Read: AP Boxite Row : తవ్వుతోంది బాక్సైటా.. లేక లేటరైటా.. ఎన్జీటీ విచారణతో ఏపీ ప్రభుత్వానికి షాకేనా..
Also Read: AP TRANSCO Recruitment 2021: ఏపీ ట్రాన్స్‌కోలో జాబ్స్.. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల