Banana Price Hike: నిన్న టమాటా, నేడు అరటి - డిమాండ్ కు తగ్గ సరఫరా లేక సెంచరీ కొట్టింది
Banana Price Hike: నిన్నటి వరకు టమాటా కిలో వంద రూపాయలు పలకగా.. నేడు అరటి పండ్లు సెంచరీ దాటాయి. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
Banana Price Hike: నిన్న, మొన్నటి వరకు వంద నుంచి 300 వరకు కిలో పలికిన టమాటా ధర కాస్త తగ్గింది. ఇప్పుడిప్పుడు ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గుతుండగా.. అరటి పండ్ల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా బెంగళూరులో కిలో అరటి పండ్ల ధర రూ.100కు చేరుకుంది. దీంతో కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు. రైతుల నుంచి సరఫరా లేకపోవడం వల్ల ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరులో విక్రయించే అరటి పండ్లలో ఎక్కువగా తమిళనాడు నుంచి వెళ్తుంటాయి. ఎలక్కిబలే, పచ్ బలే రకాలను బెంగళూరు వాసులు ఎక్కువ ఇష్టంగా కొనుగోలు చేసి తింటుంటారు. తమిళనాడు నుంచి ఈ రకం పండ్ల సరఫరా బాగా తగ్గిపోయింది. సుమారు రెండ్రోజుల క్రితం బన్నీపేట్ మార్కెట్ కు 1500 క్వింటాళ్ల ఎలక్కిబలే సరకు వస్తే.. ప్రస్తుతం అది వెయ్యి క్వింటాళ్లకు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
బెంగళూరుకు వచ్చే అరటి పండ్లు తుమకూరు, రామ నగర, చిక్ బళ్లాపూర్, అనేకల్, బెంగళూరు రూరల్ కు పంపిణీ అవుతుంటాయి. తమిళనాడులోని హోసూరు, కృష్ణగిరి నుంచి ఎక్కువగా కర్ణాటకకు అరటి రవాణా అవుతుందని మార్కెట్ అధికారులు తెలిపారు. సరఫరా తగ్గిపోవడంతో హోల్ సేల్ లో ఎలక్కిబలే రకం కేజీ రూ.78, పచ్ బలే రకం రూ.18-20 పలుకుతోందని చెప్పారు. అన్ని ఖర్చులూ కలుపుకొని వ్యాపారులు వాటిని కిలో 100 రూపాయల నుంచి 40 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు తెలిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఓనం, వినాయక చవితి విజయ దశమి పండగలు రాబోతుండగా.. ధరలు మరింత ఎక్కవయ్యే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.