Rama Temple: అయోధ్యలో ప్రతిష్ఠకు పోటీ పడిన మరో రెండు విగ్రహాలపై ట్రస్ట్ కీలక నిర్ణయం
Ram Mandir : గర్భ గుడిలో ప్రతిష్టించిన విగ్రహమే కాకుండా మరో 2 విగ్రహాలను నిర్వాహకులు పరిశీలించినట్టు చెబుతున్నారు. వాటిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Ayodya Ram Temple : అయోధ్యలో బాల రాముడి విగ్రహ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. గర్భ గుడిలో ప్రతిష్టించిన రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. ఈ రామయ్య విగ్రహం అయోధ్య ట్రస్ట్ నిర్వాహకులతోపాటు భక్తులను కూడా మంత్రముగ్ధల్ని చేస్తోంది. గర్భ గుడిలో ప్రతిష్టించిన రామ్ లల్లా విగ్రహమే కాకుండా మరో రెండు విగ్రహాలను అయోధ్య రామ మందిర ట్రస్ట్ నిర్వాహకులు పరిశీలించినట్టు చెబుతున్నారు. ఈ మూడింటిలో నల్లని రాతితో అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహానికి ట్రస్ట్ సభ్యులు ఓకే చెప్పడంతో దాన్నే గర్భ గుడిలో ప్రతిష్టించినట్టు చెబుతున్నారు. మరో రెండు విగ్రహాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. వీటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసేందుకు ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెల్లటి పాలరాతితో మరో రామయ్య..
నల్లని రాతితో అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహంతోపాటు మరో రెండు విగ్రహాలను తీర్చిదిద్దారు. వీటిలో ఒక దాన్ని రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయణ పాండే తీర్చిదిద్దారు. కొన్ని నెలలపాటు కష్టపడి తెల్లటి పాలరాతితో దీన్ని ఆయన చెక్కారు. ఇది గర్భ గుడిలోకి వెళ్లలేకపోయింది కానీ.. ఆలయ ప్రాంగణంలోనే మరో చోట దీన్ని కొలువు దీర్చనున్నారు. ఈ విగ్రహం కూడా ప్రస్తుతం ట్రస్ట్ ఆధీనంలోనే ఉంది. ఇది రామ్ లల్లా బంగారు విల్లు, బాణం పట్టుకున్నట్టు చూపిస్తుంది. ఇందులో విష్ణువు అవతారాలు వర్ణించే చిన్నపాటి శిల్పాలు డిజైన్ చేయబడ్డాయి. రామయ్యను అలంకరించచే ఆభరణాలు, బట్టలు కూడా పాలరాతితోనే చెక్కబడ్డాయి. దీనివల్ల ఈ విగ్రహం విశేషమైన హస్తకళను చూపించేలా కనిపిస్తుంది. విగ్రహం కొలతలు, ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ నిర్ధేశించిన వాటికి అనుగుణంగానే ఉన్నాయి. అరుణ్ యోగిరాజ్, పాండేతోపాటు కర్ణాటకకు చెందిన గణేష్ భట్ కూడా గర్భగుడి కోసం పరిగణించబడే ఒక శిల్పాన్ని చెక్కారు. ఇది కూడా ఇప్పుడు గర్భ గుడిలో ఎక్కడో ఒక ఉంచనున్నారు.
2.5 బిలియన్ సంవత్సరాల రాయితో తయారు..
అయోధ్య రామాలయంలోని గర్భ గుడిలో ప్రతిష్టించిన నల్లని బాల రామయ్య విగ్రహాన్ని 2.5 బిలియన్ సంవత్సరాల చరిత్ర కలిగిన నల్లటి రాతితో తయారు చేశారు. ఇదే విషయాన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ హెచ్‌ఎస్ వెంకటేష్ జాతీయ చానెల్‌తో వెల్లడించారు. ఈ రాయి అత్యంత మన్నికైనదని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎదురయ్యే అవాంతరాలను తట్టుకుంటుందని స్పష్టం చేశారు. ఉష్ణ మండల జోన్‌లో ఉత్పన్నమయ్యే పరిస్థితులను తట్టుకుంటూ వేల ఏళ్లపాటు ఉంటుందని వెల్లడించారు.
రామయ్య బాధ్యతను అప్పగించాడు..
గర్భ గుడిలో ప్రతిష్టించిన బాల రాముని విగ్రహాన్ని చెక్కిన యోగిరాజ్ ఈ అవకాశం దక్కడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాముడు తన కుటటుంబాన్ని అన్ని క్లిష్ట సమయాల నుంచి కాపాడుతున్నాడన్నారు. తనను రామయ్యే ఈ బృహత్తరమైన పనికి ఎంపిక చేసినట్టు వెల్లడించారు. విగ్రహం పూర్తయ్యేంత వరకు అనేక సార్లు నిద్రలేని రాత్రులు గడిపినట్టు తెలిపారు. తనకంటే ఈ భూమిపై అధృవంతుడు ఎవరూ లేరని నమ్ముతున్నానని పేర్కొన్నారు. విగ్రహ ప్రతిష్ట రోజు తన జీవితంలోనే అత్యుత్తమమైన రోజుగా భావిస్తున్నానన్నారు.