(Source: ECI/ABP News/ABP Majha)
బాల్య వివాహాలు చేస్తే తాట తీస్తాం, బహు భార్యత్వాన్నీ త్వరలోనే రద్దు చేస్తాం - అసోం సీఎం సంచలన ప్రకటన
Himanta Biswa Sarma: బాల్య వివాహాలపై తమ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని అసోం సీఎం హిమంత స్పష్టం చేశారు.
Himanta Biswa Sarma:
బాల్య వివాహాలపై ఫైర్..
బాల్య వివాహాలపై కఠినంగా వ్యవహరిస్తామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తేల్చి చెప్పారు. చాలా రోజులుగా దీనిపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న హిమంత...ఇప్పుడు కీలక ప్రకటన చేశారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్టు సమాచారం అందితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకోవాలని ఆదేశాలిచ్చారు. అంతే కాదు. ఇప్పటి వరకూ కొన్ని లెక్కలు తీశామని...వాళ్లందరినీ అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే పది రోజుల్లో కనీసం 3 వేల మందిని అరెస్ట్ చేయనున్నట్టు సంచలన ప్రకటన చేశారు. బీజేపీ మహిళా మోర్ఛ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. G20 సదస్సు గురించీ ప్రస్తావించారు. ఈ సమ్మిట్ ముగిసిన వెంటనే...బాల్య వివాహాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.
"G20 సదస్సు ముగిసిన వెంటనే నేను యాక్షన్‌లోకి దిగిపోవాలని ముందే నిర్ణయించుకున్నాను. బాల్య వివాహాలపై మా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. పోలీసులకూ ఈ విషయంలో ఇప్పటికే ఆదేశాలిచ్చాను. ఆర్నెల్ల క్రితం బాల్య వివాహాలు చేసిన 5 వేల మందిని అరెస్ట్ చేశాం. ఇప్పుడు G20 సమ్మిట్ ముగిసింది కాబట్టి ఇకపై పూర్తిగా ఈ సమస్యపై దృష్టి పెడతాను. రానున్న పది రోజుల్లో కనీసం 2-3 వేల మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది"
- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి
ముస్లింల గురించి ప్రస్తావన..
ఇదే సమయంలో ముస్లింల గురించి ప్రస్తావించారు హిమంత. ముస్లిం మహిళలకు అభివృద్ధి చెందే అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ యూంటీ ముస్లిం అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ బీజేపీయే ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేసిందని గుర్తు చేశారు.
"ముస్లిం మహిళలు యువతులకూ అభివృద్ధి చెందే అవకాశాలు కల్పించాలి. మా పార్టీని యాంటీ ముస్లింగా ప్రచారం చేస్తున్నారు. కానీ ముస్లింల కోసం మేం చాలా చేశాం. ముఖ్యంగా మహిళల మేలు కోరే ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేశాం. వాటితో పాటు బహు భార్యత్వం, బాల్యవివాహాలనూ అడ్డుకున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయనిదంతా మేం చేసి చూపించాం. ఇలాంటి ఆచారాలు చాలా ముస్లిం దేశాల్లోనే కనిపించడం లేదు. కానీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాత్రం వీటిని రద్దు చేయడాన్ని ఖండించారు. బహు భార్యత్వం రాష్ట్రంలో త్వరలోనే రద్దవుతుంది. డిసెంబర్‌లో ఇందుకు సంబంధించిన బిల్ తీసుకొస్తాం"
- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి
హిమంత బిశ్వ శర్మ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ముస్లిం ఓట్లు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తాను దూరం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లా ప్రతి అంశాన్ని రాజకీయం చేసి ఓట్ల కోసం హడావుడి చేయమని వెల్లడించారు. ముఖ్యంగా ముస్లింల సమస్యలపై ఓటు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతానికి తనకు ముస్లింల ఓట్లు అవసరం లేదని తెలిపారు.
"ప్రస్తుతానికి నాకు ముస్లిం ఓట్లతో పని లేదు. వాటి అవసరం నాకు లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే సమస్యలన్నీ. నెలకోసారి ముస్లింలున్న ప్రాంతానికి వెళ్తాను. వాళ్ల కార్యక్రమాలకు హాజరవుతాను. వాళ్లతో మాట్లాడతాను. కానీ వాళ్ల అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టను. కాంగ్రెస్ ఇన్నాళ్లు తమను ఓట్ల కోసం ఎలా వాడుకుందో ముస్లింలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాు"
- హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం
Also Read: Vladimir Putin: జీవితకాలం పుతినే అధ్యక్షుడు? పోటీదారులెవరూ లేరంటున్న క్రెమ్లిన్