Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు, సింగిల్ బెంచ్ నిర్ణయాన్నే సమర్థించిన డివిజన్ బెంచ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
సంక్రాంతి అనంతరం తగ్గుముఖం పట్టిన చలి, తెలంగాణలో తాజాగా పెరిగింది. కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది. నేడు మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధరణంగా ఉండగా, ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని 13 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన సంగతి తెలిసిందే. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.
ఎల్లో అలర్ట్ ఈ 13 జిల్లాల్లో
ఆదిలాబాద్, కుమ్రుం భీమ్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి, ములుగు, జగిత్యాల, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు, ఎల్లుండి నుంచి క్రమంగా చలి తగ్గిపోతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.
ఖమ్మంలో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 33.6 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత 9.2 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా ఉంటుందని... అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. కొమొరిన్ ప్రాంతం, పరిసరాల్లో సగటు సముద్ర మట్టం కంటే 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకూ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడిందని వివరించింది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.
ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మొన్నటి వరకు అత్యంత కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితి నుంచి ఆ ప్రాంతాలు తేరుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చలి గణనీయంగా తగ్గింది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో హిమపాతాలు, లోతట్టు మైదానాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల ఉదయం, సాయంత్రం పొగమంచు కనిపిస్తోంది.
CM Jagan News: సీఎం జగన్‌ను కలిసిన సైకిల్ యాత్రికురాలు
- సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన సైకిల్‌పై దేశాన్ని చుట్టివస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య
- ఆశా మాలవ్యను ప్రత్యేకంగా అభినందించిన సీఎం వైఎస్ జగన్, ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్ష, రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి
- సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు పూర్తయిందని సీఎంకి వివరించిన ఆశా మాలవ్య
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఆశా మాలవ్య కృషిని సీఎం ప్రశంసించారు.
TRS MLA Poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణలో మునుగోడు ఎన్నికల సమయంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగా, తాజాగా డివిజన్ బెంచ్ కూడా దాన్నే సమర్థించింది. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. దీంతో సీబీఐ విచారణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం, పేకమేడల్లా కూలుతున్న భవనాలు
టర్కీలోని నూర్దగికి తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. వీరిలో ఉస్మానియాలో 5 మంది, సాన్లియూర్ఫాలో 5 మంది చనిపోయారు. టర్కీలోని అదానా నగరంలో 17 అంతస్తులు, 14 అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. BNO న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. భూకంపం యొక్క తీవ్రత రియాక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదైంది. దక్షిణ టర్కీలో ఈ భూకంపం సంభవించింది. ఇక్కడ చాలా అపార్ట్‌మెంట్లు కూలిపోయాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. అదే సమయంలో, భూకంపం తరువాత, టర్కీ అంతర్జాతీయ సహాయం కోసం విజ్ఞప్తి చేసింది.
స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:17 గంటలకు 17.9 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. అదే సమయంలో, దక్షిణ టర్కీలోని గాజియాంటెప్ సమీపంలో సోమవారం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. దీంతో టర్కీ, సిరియాలో పెను నష్టం వాటిల్లినట్లు వార్తలు వచ్చాయి.
టర్కీలో హై అలర్ట్
BNO న్యూస్ ప్రకారం, శక్తివంతమైన భూకంపం తర్వాత హై అలర్ట్ ప్రకటించినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని ఈ వీడియోల్లో స్పష్టంగా చూడవచ్చు.