కాంగ్రెస్ లోకి కన్హయ్య, జిగ్నేష్ మేవాని.. ముహూర్తం ఫిక్స్..
గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని, జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాంగ్రెస్ లోకి చేరేందుకు డేట్ ఫిక్స్ అయింది.
కేంద్రం, పలు రాష్ట్రాల్లోనూ అధికారం అందుకోలేక దిగాలుగా ఉన్న.. కాంగ్రెస్ కు ఇటీవలి కాలంలో చాలా మంది యువనాయకుల రాజీనామా చేశారు. అయితే యువరక్తాన్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రణాళికలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని, జేఎన్ యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ని పార్టీలోకి ఆహ్వానించింది. ఈ ఇద్దరు నేతలు పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. జెన్ఎయూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ తో కలిసి జిగ్నేశ్ మేవాని హస్తం పార్టీలోకి రానున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో సెప్టెంబర్ 28న యువనేతలిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం యువనేతలతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ టీమ్‌లో కన్హయ్య కుమార్, మేవాని కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.
గుజరాత్ లోనూ బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగాంగానే.. ఆ రాష్ట్రంలోని బనస్కాంత జిల్లా వద్గమ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన జిగ్నేశ్ మేవానిపై ఆశలు పెట్టుకుంది. కిందటి ఎన్నికల్లో జిగ్నేశ్ పై అభ్యర్థిని నిలపకుండా ..అతడి గెలుపునకు కాంగ్రెస్ సహకరించింది. ఈ కారణంగా కాంగ్రెస్ పట్ల జిగ్నేశ్ కు సానుకూలంగా ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జిగ్నేశ్ రాష్ట్రీయ దళిత అధికార మంచ్ కన్వీనర్. దళిత వర్గాల్లో మంచి పట్టు ఉన్న నేత. సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్, యువ నాయకుడు రాజీవ్ సతావ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ గుజరాత్‌లో నాయకత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. జిగ్నేష్ మేవాని పార్టీలో చేరితే శక్తిమంతమైన దళిత నాయకుడి అండ పార్టీకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీహార్ కు చెందిన యువనేత కన్హయ్య కుమార్ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు. తన ప్రసంగాలతో ఆకట్టుకుంటారు. కిందటి ఎన్నికల సమయంలో మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో బీహార్ లోని బెగుసరాయ్ ఎంపీ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా భారీగానే ఓట్లు సంపాదించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగానూ ఉన్నారు. అయితే కొంత కాలంగా పార్టీ తీరు పట్ల అసంతృప్తితో ఉన్న కన్హయ్య కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తుపై కన్హయ్య కుమార్ ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశమయ్యారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉండటంతో యువతను బాగా ఆకర్షించే కన్హయ్య కుమార్‌ను ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది.