ABP Nadu Impact Makers Conclave: వచ్చెే ఎన్నికల్లో 200 సీట్లు నెగ్గడమే డీఎంకే టార్గెట్.. ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మంత్రి తంగం తెన్నరసు
Thangam Tennarasu | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు సాధించడమే డీఎంకే టార్గెట్ అని మంత్రి తంగం తెన్నరసు అన్నారు. కాస్త కష్టపడితే అసాధ్యం మాత్రం కాదన్నారు.

DMK winning 200 Seats in 2026 TN Election | చెన్నై: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో DMK 200 సీట్లను కైవసం చేసుకుంటుందని తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు అన్నారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే భారీ విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల సీట్లు నెగ్గడం తమకు అసాధ్యం మాత్రం కాదన్నారు. ఏబీపీ నాడు చెన్నైలో నిర్వహించిన ఇంపాక్ట్ మేకర్స్ కాన్‌క్లేవ్‌లో డీఎంకే మంత్రి తంగం తెన్నరసు కీలక అంశాలు మాట్లాడారు.
“200 సీట్లు గెలవడం సాధ్యమే”
ఏబీపీ నాడు కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు గెలవడం డిఎంకెకు సాధ్యమయ్యే టార్గెట్. 1971లో జరిగిన ఎన్నికల్లో డిఎంకె 184 సీట్లు గెలిచి రికార్డు సృష్టించింది. కనుక కొంచెం ఫోకస్ చేస్తే 200 సీట్లు అనేది అసాధ్యం మాత్రం కాదు. సరైన ప్రణాళిక ఉంటే, ఆ లక్ష్యాన్ని సాధించవచ్చు. మేం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మద్దతు మాకుంది. డీఎంకే మరోసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని’ ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంకీర్ణ పార్టీలను కలిపి ఉంచారు. కొందరు మా భాగస్వామయ్య పార్టీలను డీఎంకే నుంచి దూరం చేయాలని ప్రయత్నించారు. కానీ అది జరగలేదని మంత్రి అన్నారు. మేము ఇప్పుడే ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాం. మధురైకి వెళ్తున్న సీఎం స్టాలిన్ కు ఘనస్వాగతం పలకడానికి అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు తన సందేశాన్ని ఇవ్వనున్నారు.

డీఎంకే, మా మిత్రపక్షాలు వచ్చే ఎన్నికల్లో విజయంపై ఫోకస్ చేశాయి. కలిసికట్టుగా పనిచేస్తే, మరోసారి మా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, సీఎం స్టాలిన్ మీద ప్రజలు ఉంచిన నమ్మకం మరో విజయానికి దోహదపడతాయని మంత్రి తంగం తెన్నరసు స్పష్టంగా పేర్కొన్నారు.
సంక్షేమమే మాకు ప్లస్
తమిళనాడు ప్రభుత్వం సరైన ఆర్థిక ప్రణాళికల ద్వారా తన ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా అటు సంక్షేమ, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ప్రజా ధనాన్ని వృధా చేయకుండా, అవసరమైన కార్యక్రమాలకు నిధులు కేటాయించి సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రభుత్వ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టినట్లుగా, సామాజిక పురోగతిలో, సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం. తమిళనాడు ప్రభుత్వం చివరి వార్షిక బడ్జెట్ లో చేసిన ప్రకటనలే అందుకు నిదర్శనం అని ఆయన అన్నారు.
కేంద్రం మద్దతు లేకున్నా ముందుకు..
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక భాగస్వామ్యం తక్కువగా ఉందని, 40 శాతం అని వాళ్లు చెప్పినప్పటికీ, కేవలం భాగస్వామ్యం 31 శాతం మాత్రమే ఉందన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత, రాష్ట్రాలు ఏ వస్తువుపైనా, ఎలాంటి పన్నులు విధిస్తాయో వాటిపై ట్యాక్స్ విధించే హక్కును కోల్పోయాయి. చాలా సందర్భాలలో తమిళనాడు పన్ను ఆదాయం నుంచి సర్దుబాటు చేస్తున్నామని మంత్రి తంగం తెన్నరసు అన్నారు. పథకాలను అమలు చేయడంలో కేంద్రం తక్కువ నిధులను అందించడంతో ఆర్థిక భారం పడుతుందని అన్నారు. ఆర్థిక వృద్ధి 9.6 శాతం ఉందన్నారు.
ఆర్‌బిఐ రుణ పరిమితులు
రిజర్వ్ బ్యాంక్ విధించిన బంగారు ఆభరణాల రుణ పరిమితులు సామాన్యులపై ప్రభావం చూపుతున్నాయి. అత్యవసర సమయాల్లో ప్రజలు ఆభరణాలను తాకట్టు పెడతారని కానీ ఆర్బీఐ నిర్ణయాలు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.






















