AAP Opposition Meeting: బెంగళూరులో జరిగే విపక్షాల భేటీకి ఆప్- స్పష్టం చేసిన రాఘవ్ చద్దా
AAP Opposition Meeting: బెంగళూరులో సోమ, మంగళవారాల్లో జరిగే ప్రతిపక్ష సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొననుంది. ఈ మేరకు రాఘవ్ చద్దా తెలిపారు.
AAP Opposition Meeting: సోమ, మంగళ వారాల్లో బెంగళూరు వేదికగా జరిగే విపక్ష పార్టీల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) హాజరుకానున్నట్లు ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తెలిపారు. ఢిల్లీ లో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత ఆప్ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ ప్రకటన వెలువడిన తర్వాత.. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ భేటీ అనంతరం ఆప్ విపక్షాల భేటీలో పాల్గొననున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ నాయకత్వంలో జరిగే విపక్షాల భేటీకి ఆప్ హాజరు అవుతుందా అని సమావేశానికి ముందు అడిగినప్పుడు.. రాజకీయ వ్యవహారాల కమిటీ -పీఏసీ తర్వాత మాత్రమే దాని గురించి చెప్పగలమని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ సమావేశానికి రాఘవ్ చద్దా, దుర్గేష్ పాఠక్, గోపాల్ రాయ్ సహా పలువురు అగ్రనేతలు హాజరు అయ్యారు.
జూన్ 23వ తేదీన పాట్నాలో ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పాల్గొన్న ఆప్.. కేంద్రం తీసుకొచ్చిన సర్వీస్ ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే తప్పా.. తాము ఏదైనా కూడమిలో భాగం కావడం చాలా కష్టమని ఆప్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాజ్యసభలో ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని కోరుతూ కేజ్రీవాల్ మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్ లతో సహా ప్రతిపక్షణ పార్టీల నేతలతో వ్యక్తిగతంగా సమావేశమై అడిగారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కులు, బాధ్యతలపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా తాము నిరంతరం పోరాడుతున్నామని కాంగ్రెస్ శనివారం ప్రకటించింది. ఇటువంటి ప్రయత్నాలను పార్లమెంట్ లోపల, బయటా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పుకొచ్చింది.
సర్వీస్ ఆర్డినెన్స్ ఏంటి అసలు?
ఢిల్లీ గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీల కోసం ఓ అథారిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర సర్కారు మే 19వ తేదీని ఆర్డినెన్స్ జారీ చేసింది. ఢిల్లీ ప్రాంత ప్రభుత్వ సవరణ ఆర్డినెన్స్, 2023 పేరుతో జారీ అయిన ఈ ఆర్డినెన్స్ ను ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తోంది. తమకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దేశంలోని అనేక రాజకీయ పార్టీలను, ముఖ్యమంత్రులను కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ శనివారం మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసినంత వరకు బెంగళూరు సోమవారం జరిగే ప్రతిపక్ష పార్టీల సమాశంలో పాల్గొనే 24 పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉందన్నారు. బెంగళూరులో ఈ సమావేశాలు సోమవారం, మంగళవారాల్లో జరుగుతాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో గత నెలలో పాట్నాలో జరిగిన మొదటి సమవేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గద్దే దించడమే తమ లక్ష్యమని ఈ పార్టీలు చెబుతున్నాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial