సిక్కింలో ఆకస్మిక వరదలు-23 మంది సైనికులు మిస్సింగ్
సిక్కింలో కురుస్తున్న కుండపోత వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఈ వరదల ధాటికి 23 మంది సైనికులు మిస్సయ్యారు.
సిక్కింలో కురుస్తున్న కుండపోత వర్షాలకు 23 మంది సైనికులు మిస్సయ్యారు. మంగళవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు రావడంతో... 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తర సిక్కింలోని కుండపోతల వానలు రావడంతో తీస్తానది వరద పోటెత్తింది. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పెరిగింది. సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నది పొంగి ప్రవహించడంతో తీస్తా నదిపై ఉన్న సింథమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. పశ్చిమ బెంగాల్-సిక్కింను కలిపే జాతీయ రహదారి-10 పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయింది. ఆకస్మిక వరదల కారణంగా రోడ్లను అధికారులు మూసివేశారు. సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. తీస్తానది సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి అధికారులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా...లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆకస్మిక వరదల కారణంగా దాదాపు 2,400 మంది పర్యాటకులు ఈ ప్రాంతంలో చిక్కుకుపోయారు.