కెనడాలో భారతీయ విద్యార్థుల టెన్షన్, ఎలా ఉన్నారో అని గాబరా పడుతున్న తల్లిదండ్రులు
India vs Canada Issue: కెనడాలో ఉన్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
India vs Canada Issue:
ఉద్రిక్తతలు..
భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఇండియాలో వాళ్ల తల్లిదండ్రులూ టెన్షన్ పడుతున్నారు. వాళ్లు సేఫ్‌గా ఉంటారా లేదా..? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు..? అని హైరానా పడిపోతున్నారు. వాళ్లపై వివక్ష పెరిగే ప్రమాదముందని, ఇండియన్స్ అని చిన్న చూపు చూస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.
"మా కూతురు 7 నెలల క్రితం కెనడాకి చదువుకోడానికి వెళ్లింది. తను కూడా చాలా భయపడుతోంది. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతోంది"
- బల్వీందర్ సింగ్
మరో తండ్రి ఆవేదన కూడా ఇదే. ఈ వివాదం వల్ల పిల్లలు చాలా భయపడిపోతున్నారని ప్రభుత్వాలు వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నారు.
"మా ఇద్దరు కూతుళ్లు కెనడాలోనే ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భయమేస్తోంది. రెండు దేశాల ప్రభుత్వాలు కలిసి కూర్చుని సమస్యని పరిష్కరించుకుంటే బాగుంటుంది"
- కుల్‌దీప్ కౌర్
విద్యార్థుల కన్‌ఫ్యూజన్..
కెనడాకి వెళ్లి చదువుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న వాళ్లూ సందిగ్ధంలో పడిపోయారు. భారత్, కెనడా మధ్య వివాదం మరింత ముదిరే అవకాశాలుండడం వల్ల వాళ్ల ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. వీసా సర్వీస్‌లను నిలిపివేయడమూ వాళ్లని ఆందోళనకు గురి చేస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం కెనడాలోని భారత విద్యార్థులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జఖార్‌తో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
"కెనడాలోని భారత విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేసి అక్కడి భారత రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి సాయాన్నైనా పొందొచ్చు. త్వరలోనే ఓ వాట్సాప్ నంబర్‌ని కూడా అందరికీ అందిస్తాం. ఎప్పటికప్పుడు మీతో టచ్‌లో ఉండేందుకే ప్రయత్నిస్తున్నాం"
- సునీల్ జఖార్, పంజాబ్ బీజేపీ చీఫ్
ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత్- కెనడా దేశాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు కారణం అవుతోంది. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్లకు పాత్ర ఉందంటూ చేసిన కెనడా ప్రధాని వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం కూడా దీటుగా స్పందిస్తోంది. జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చిన భారత్.. ఇప్పుడు ఉగ్రవాది అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ బతికున్నప్పుడు పన్నిన కుట్రలు తాలుకూ వివరాలు బయటపెడుతోంది. ఈ మేరకు గతంలో నిజ్జర్ భారత దేశంలో దాడులకు సిక్కులకు ఇచ్చిన ఆదేశాల సమాచారాన్ని తాజాగా నిఘా వర్గాలు వెల్లడించాయి. హర్దీప్ సింగ్ నిజ్జర్ 1980ల నుంచే నేరాలు చేస్తున్నాడని, చిన్నప్పటి నుంచే స్థానిక గూండాలతో సంబంధాలు కలిగి ఉన్నాడని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. 1996లో నకిలీ పాస్‌పోర్టుతో నిజ్జర్ కెనడాకు పారిపోయి, మొదట్లో అక్కడ ట్రక్కు డ్రైవర్ గా పని చేసినట్లు వెల్లడించాయి.
Also Read: G20తో భారత్ సామర్థ్యమేంటో ప్రపంచానికి తెలిసింది, ఏడాది పాటు వేడుకలు - మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ