Dubai Floods: దుబాయ్ ప్రయాణం మానుకోండి, భారతీయులకు ఇండియన్ ఎంబసీ సూచన
Dubai Floods: వరదల నేపథ్యంలో భారతీయులు దుబాయ్ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచించింది.
Dubai Floods News: దుబాయ్‌లో అకాల వర్షాలు (Dubai Flooding) ముంచెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా వరద నీళ్లే కనిపిస్తున్నాయి. ఏడాదిలో కురిసే వర్షం కేవలం 24 గంటల్లోనే కురిసి ఆ నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఎడారి నగరంలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు రకరకాల కారణాలున్నాయని (Floods in Dubai) పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే UAEలోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. దుబాయ్‌కి వచ్చే భారతీయ ప్రయాణికులు, లేదా దుబాయ్ మీదుగా వేరే దేశానికి వెళ్లే ప్యాసింజర్స్ ప్రస్తుతానికి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే వాళ్లు ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవాలని వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాన్ని మానుకోవాలని తెలిపింది. సేవలు పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితికి వచ్చేంత వరకూ ఆగాలని సూచించింది. యూఏఈ అధికారులు సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేసింది. ఆయా ఎయిర్‌లైన్స్ సంస్థలు అధికారికంగా ధ్రువీకరించిన తరవాతే ఫ్లైట్ టైమింగ్స్ వివరాలన్నీ ప్రయాణికులకు వెల్లడించనున్నారు. భారీ వర్షాల కారణంగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే ఫ్లైట్‌ల సంఖ్యని తగ్గించారు.
⚠️ IMPORTANT ADVISORY ⚠️ For Indian passengers travelling to or transiting through the Dubai International Airport. 24x7 @cgidubai
— India in UAE (@IndembAbuDhabi) April 19, 2024
Helpline Numbers:
+971501205172
+971569950590
+971507347676
+971585754213@MEAIndia @IndianDiplomacy pic.twitter.com/sGMv9XiSZT
ఏప్రిల్ 17వ తేదీనే భారత రాయబార కార్యాలయం యూఏఈలోని భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి అవసరం వచ్చినా సాయం (Dubai Rainfall) చేస్తామని ప్రకటించింది. ఏప్రిల్16 వ తేదీన భారీ వర్షాలు దుబాయ్‌ని తడిపి ముద్ద చేశాయి. నగరవ్యాప్తంగా వరదలు వచ్చాయి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే కూడా జలమయం అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. వాహనాలన్నీ ఈ నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. కుండపోత వాన కురవడం వల్ల ఏప్రిల్ 16వ తేదీన దాదాపు అరగంట పాటు ఎయిర్‌పోర్ట్‌ని మూసేశారు. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న వాళ్లని కాపాడేందుకు వాలంటీర్లు ముందుకొచ్చారు. ఆ తరవాత కూడా పలు ఫ్లైట్‌ల షెడ్యూల్ మారిపోయింది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారత్, పాకిస్థాన్, సౌదీ, యూకేకి వెళ్లే ఫ్లైట్‌ల సర్వీస్‌లపై ప్రభావం పడుతోంది. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు అన్ని విధాలుగా సహకరిస్తామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. నిన్నటి వరకూ వరదలతో నిండిపోయిన అక్కడి రోడ్‌లు ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నాయని ప్రజలు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. అయితే..Cloud Seeding కారణంగానే దుబాయ్‌లో ఇలా అకాల వర్షాలు పడినట్టు కొందరు చెబుతున్నారు. నీటి సంరక్షణ కోసం అక్కడి ప్రభుత్వం మేఘమథనం చేసిందని, ఆ ఎఫెక్ట్ ఇలా కనిపిస్తోందని అంటున్నారు.