PM Modi : లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వేళ పీఎం మోదీ కీలక వ్యాఖ్యలు
Modi in UNO GA : మానవత్వపు విజయం ఐకమత్యంలో ఉంటుంది కానీ.. యుద్ధరంగంలో కాదన్న మోదీ.. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య భీకర పోరు వేళ ఐరాసలో మోదీ కీలక ప్రసంగం.. భారత వసుధైక స్ఫూర్తి గురించి పునరుద్ఘాటన
Modi Speech At UNO: రష్యా- ఉక్రెయిన్, ఇజ్రెయల్- గాజా, ఇజ్రాయెల్- లెబనాన్ పోరు కొనసాగుతున్న వేళ.. ఐకమత్యంతోనే మానవత్వపు విజయం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసగించిన మోదీ.. యుద్ధరంగంలో మానవత్వపు ఛాయలు ఉండవని స్పష్టం చేశారు. ప్రపంచ జనాభాలో ఆరో వంతుగా ఉన్న భారతదేశ ప్రజల మానవత్వపు ప్రతీకగా ఇక్కడ తాను నిలబడ్డానని ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి మోదీ అన్నారు. భావి ప్రపంచం గురించి ముందు రోజు UNGA నేతలు ఒక ప్రకటన చేయగా.. ప్రపంచపు భవిష్యత్ గురించి మనం మాట్లాడుతున్నామంటే అది పూర్తిగా మానవత్వపు కోణంలోనే ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్- లెబనాన్ భీకర పోరు సమయంలో మోదీ కీలక ప్రసంగం:
Speaking at Summit of the Future at the @UN. https://t.co/lxhOQEWEC8
— Narendra Modi (@narendramodi) September 23, 2024
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగిన వేళ.. యూఎన్‌జీఏ సమావేశంలో ప్రధాని మోదీ చేసిన 5 నిమిషాల ప్రసంగం కీలకంగా మారింది. భవిష్యత్ గురించి ఏ ఆలోచన చేసినా అది మానవత్వం ఆధారంగానే ఉండాలన్న మోదీ.. ఐకమత్యంలోనే అది కనిపిస్తుందని.. యుద్ధ రంగంలో కాదని.. పరోక్షంగా ఇజ్రాయెల్- లెబనాన్ యుద్ధాన్ని ఖండించారు. యూఎన్‌జీఏ నేతల మధ్య కుదిరిన ఒడంబడికలో ఐదు ముఖ్యాంశాలున్నాయి. సుస్థిరాభివృద్ధి, అంతర్జాతీయ శాంతి, భద్రత, శాస్త్ర సాంకేతికత, యువత భవిష్యత్, అంతర్జాతీయ వ్యవహారాల్లో మార్పులు ప్రధానంగా ఉన్నాయి. 2025 నాటికి యూఎన్ 80 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. అంతర్జాతీయంగా శాంతి సామరస్యం నెలకొనాలన్న యూఎన్ ఆకాంక్షలు నెరవేరాలంటే.. భద్రతామండలి వంటి అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు అవసరాన్ని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. భారత్ నేతృత్వంలో జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్ చేర్చడం ద్వారా అలాంటి అంతర్జాతీయ సంస్థల మార్పులకు తాము నాంది పలికామని మోదీ గుర్తు చేశారు. 15 దేశాల భద్రతామండలిలో మార్పుల గురించి భారత్ ఏళ్లుగా పోరాటం చేస్తోందని చెప్పిన మోదీ.. ప్రస్తుత అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి మండలి విధానాలు అనువుగా లేవని స్పష్టం చేశారు. ఆ భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
టెర్రరిజం సహా కొత్త కొత్త సవాళ్లను ప్రపంచం సమర్థంగా ఎదుర్కోవాలంటే దానికి తగిన విధంగా వ్యవస్థలు ఉండాలని తేల్చి చెప్పారు. ఒకవైపు టెర్రరిజం అతి పెద్ద సవాలుగా మారిన వేళ.. సైబర్, మారిటైమ్, స్పేస్ వంటి అంశాలు కూడా అతి పెద్ద సవాళ్లుగా పరిణమించబోతున్నాయని నొక్కి చెప్పారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గ్లోబల్ కార్యాచరణ ఉండాలని తెలిపారు. భారత్ తమ దేశంలోని పాతిక కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది భారత్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సమర్థంగా అమలు చేసిందనడానికి ఒక రుజువుగా పేర్కొన్నారు. ప్రతి ఒక్క మనిషికి ఆహారం, ఆరోగ్యం, సరైన భద్రత కల్పించడం తమ లక్ష్యాలుగా ఉండాలన్నారు. ప్రతి దేశపు సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, భద్రతను పెంపొందించేలా అంతర్జాతీయంగా డిజిటల్ గవర్నెన్స్ రావాలని మోదీ అభిప్రాయపడ్డారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఒక బ్రిడ్జ్‌లా ఉండాలే కానీ అడ్డుగోడలా ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. భారత్ చేపట్టిన డిజిటలైజేషన్ డ్రైవ్ గురించి ఐక్యరాజ్యసమితి సహా సభ్య దేశాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. భారత్ ఎప్పుడూ వసుధైక కుటుంబకం అన్న సూత్రంతోనే ముందుకు సాగుతుందని.. విశ్వశాంతికి కృషి చేస్తుందని మోదీ యూఎన్‌జీఏలో తెలిపారు.
యూఎన్‌జీఏ సమావేశానికి వెళ్లిన ప్రధాని అక్కడ.. పాలస్తీనా, ఉక్రెయిన్ అధ్యక్షులతో చర్చించారు. ఆయా దేశాల్లో జరుగుతున్న విధ్వంసకాండపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశం ఎల్లప్పుడూ మానవత్వం పక్షానే నిలుస్తుందని.. చర్చల ద్వారానే శాంతి ఏర్పడుతుందని యుద్ధం ద్వారా కాదని తాము విశ్వసిస్తున్నట్లు వారికి స్పష్టం చేశారు.
Also Read: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు- 492 మందికిపైగా మృతి- ప్రజలకు నెతన్యాహూ తీవ్ర హెచ్చరిక