Gyanvapi Masjid Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో నేడు కీలక తీర్పు- 144 సెక్షన్ విధించిన పోలీసులు
Gyanvapi Masjid Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో నేడు తీర్పు రానుండటంతో వారణాసిలో 144 సెక్షన్ విధించారు.
Gyanvapi Masjid Verdict: ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి కీలక తీర్పును వారణాసి జిల్లా కోర్టు నేడు వెలువరించనుంది. మసీదు కాంప్లెక్స్‌లో ఉన్న హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నేడు కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
144 సెక్షన్
అత్యంత సున్నితమైన కేసు కావడంతో వారణాసిలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం కావడంతో కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద భద్రతను భారీగా పెంచారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు విన్న జిల్లా న్యాయమూర్తి అజయ్ కృష్ణ ఆగష్టు 24న తీర్పును సిద్ధం చేసినప్పటికీ వాయిదా వేశారు. ఆ తీర్పు నేడు వెలువరించనున్నారు.
ఇదే కేసు
జ్ఞాన్వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు.
సర్వేలో
జ్ఞాన్వాపి మసీదు- శృంగార్ గౌరీ ప్రాంగణంలో మొదలైన వీడియోగ్రఫీ సర్వే ప్రశాంతంగా ముగిసింది. మసీదులో 3 రోజుల సర్వేకు వారణాసి సివిల్ జడ్జి కోర్టు ఆదేశించింది. విచారణకు ఒక రోజు ముందే ఆ ప్రక్రియ పూర్తైంది.
ప్రార్థన స్థలంలోని భూగర్భ నేలమాళిగలు, చెరువు, మూడు గోపురాలను సర్వే బృందం వీడియో తీసింది. అయితే మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ సర్వే నివేదికను అడ్వకేట్ కమిషనర్ కోర్టులో సమర్పించారు. అయితే అది శివలింగం కాదంటూ మసీద్ కమిటీ వాదిస్తోంది.
సుప్రీం కోర్టుకు
ఈ వ్యవహారం తర్వాత సుప్రీం కోర్టుకు చేరింది. అయితే జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సివిల్ కోర్టు నుంచి వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసును ఉత్తర్‌ప్రదేశ్ జుడీషియల్ సర్వీసులో ఉన్న అత్యంత సీనియర్, అనుభవమున్న న్యాయమూర్తి విచారిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది.
ఉత్కంఠ
దీంతో ఈ కేసు తిరిగి వారణాసి కోర్టుకే చేరింది. కమిటీ రిపోర్ట్ సీల్డ్ కవర్‌లో వారణాసి కోర్టుకు చేరింది. అయితే వీడియో రికార్డింగ్‌కు సంబంధించిన ఫుటేజీలు బయటకు రావడంతో కలకలం రేగింది. దీంతో నేటి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Also Read: Swami Swaroopanand Saraswati: స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం- ప్రధాని మోదీ సంతాపం
Also Read: Viral News: రాత్రి దిండు కింద మొబైల్ పెట్టుకుని నిద్రపోయిన మహిళ- తెల్లారేసరికి!