గవర్నమెంట్ జాబ్ రాలేదని గాడిదల ఫామ్ పెట్టాడు, ఇప్పుడు నెలకి రూ.3 లక్షల సంపాదన
Donkey Milk: గుజరాత్‌కి చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్‌లో గాడిద పాలు విక్రయిస్తూ నెలకి రూ.3 లక్షలు సంపాదిస్తున్నాడు.
Donkey Farm in Gujarat: గాడిద పాలకు ఎంత డిమాండ్ (Demand For Donkey Milk) ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా చలికాలంలో వీటికి ఫుల్ గిరాకీ. ఆస్తమా వ్యాధికి ఇది చాలా మంచి ఔషధం అని చెబుతుంటారు వైద్యులు. అటు వ్యాధులకే కాదు. ఇటు వ్యాపారానికీ ఈ గాడిద పాలు బోలెడంత మేలు చేస్తోంది. గుజరాత్‌లోని ధీరెన్ సోలంకి (Dhiren Solanki) సొంత ఊళ్లోనే ఓ గాడిదల ఫామ్ పెట్టుకున్నాడు. అందులో 42 గాడిదలున్నాయి. వాటి నుంచి సేకరించిన పాలతో నెలకి రూ.2-3 లక్షలు సంపాదిస్తున్నాడు. ఉన్న ఊళ్లోనే ఇలా లక్షలు సంపాదించే అవకాశం ఎంత మందికి వస్తుంది చెప్పండి. అందుకే చాలా సంతోషంగా ఉన్నాడా యువకుడు. ప్రస్తుతం మార్కెట్‌లో గాడిద పాలకున్న రేట్‌కి కనీసం 70 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. అందుకే ఆ స్థాయిలో లాభాలు వస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లోని కస్టమర్స్‌కి ఆన్‌లైన్‌లో సప్లై చేస్తున్నాడు. అందుకే అంత ధర. నిజానికి ఈ ఫామ్ పెట్టుకోకముందు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యాడు ధీరెన్. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. ఆ తరవాత ప్రైవేట్ జాబ్ చేయాలని అనుకున్నాడు. ఆ జీతానికి నెల ఖర్చులకు సరిపోతాయి అనుకున్న ధీరెన్ వెంటనే సొంత వ్యాపారం పెట్టుకోవాలని ఆలోచించాడు. అప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లో గాడిదల సంఖ్య తక్కువగా ఉందని గుర్తించాడు. వెంటనే వాటితోనే ఓ ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అదిగో అలా మొదలు పెట్టి ఇప్పుడు రూ.లక్షల సంపాదనతో ఆనందంగా ఉన్నాడు.
ఇలా మొదలు పెట్టాడట..
8 నెలల క్రితం ఈ గాడిదల ఫామ్ పెట్టాడు ధీరెన్ సోలంకి. మొదట 20 గాడిదలతో రూ.22 లక్షల పెట్టుబడితో ఈ ఫామ్‌ని ఏర్పాటు చేశాడు. మొదట్లో వ్యాపారం కొనసాగించడం చాలా కష్టంగా అనిపించేది. గుజరాత్‌లో గాడిద పాలకు డిమాండ్ చాలా తక్కువ. దాదాపు 5 నెలల పాటు ఏమీ సంపాదించలేకపోయాడు. ఆ తరవాతే సౌత్ ఇండియాపై ఫోకస్ పెట్టాడు. ఇక్కడ గాడిద పాలకు డిమాండ్ బాగుందని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి కర్ణాటక, కేరళకి ఆన్‌లైన్‌లో గాడిద పాలు సప్లై చేయడం మొదలు పెట్టాడు. ఎన్నో కాస్మెటిక్ కంపెనీలు ఇప్పుడు సోలంకికి క్లైంట్స్‌గా మారిపోయాయి. ఆవు పాల ధర రూ.65 వరకూ ఉంటే గాడిదపాల లీటర్ ధర రూ.5-7 వేల వరకూ పలుకుతోంది. ఇదే మంచి లాభాలు తెచ్చి పెడుతోంది. పాలు చెడిపోకుండా ఫ్రీజర్స్‌లో ఉంచుతాడు. ఈ పాలను ఎండబెట్టి పౌడర్ రూపంలోనూ విక్రయిస్తున్నాడు. కిలో పౌడర్ ధర రూ.లక్ష. ఇప్పటి వరకూ ఈ వ్యాపారంపై రూ.38 లక్షల పెట్టుబడి పెట్టాడు సోలంకి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాను ఎలాంటి సాయం తీసుకోలేదని,పూర్తిగా తన సొంతగానే వ్యాపారాన్ని నడుపుతున్నానని చెబుతున్నాడు. లివర్ సమస్యలు, ఇన్‌ఫెక్షన్‌లు, జ్వరాలకు గాడిద పాలు (Donkey Milk Benefits) దివ్యౌషధం అంటున్నారు వైద్యులు. ఆవు పాలు తీసుకుంటే కొంత మందికి అలెర్జీ వస్తుంటుంది. అలాంటి వాళ్లకి గాడిద పాలు మంచి ప్రత్యామ్నాయం.
Also Read: ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చిన మహిళ, వైద్యుల్నే ఆశ్చర్యపరిచిన అరుదైన ఘటన