Gujarat Assembly Election: ఎన్నికల ప్రచారం చేస్తున్న రోబో, స్లోగన్స్ కూడా ఇచ్చేస్తోంది - ఐడియా అదుర్స్
Gujarat Assembly Election: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రోబోతో క్యాంపెయినింగ్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
Gujarat Election 2022:
రోబోతో బీజేపీ ప్రచారం..
గుజరాత్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆప్, భాజపా, కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు ఆప్ గట్టిగా ప్రయత్నిస్తోంది. బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్ల సంఖ్య పెంచుకోవాలని భీష్మ ప్రతిజ్ఞ చేసింది. గతంలో కన్నా రికార్డు స్థాయి మెజార్టీతో గెలవాలని సంకల్పించుకుంది. ప్రచారంలోనూ కొత్తదనంతో ముందుకెళ్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రోబోతో ప్రచారం నిర్వహిస్తోంది. ఇంటింటికీ వెళ్లి పాంప్లెట్స్ పంచడం నుంచి ప్రచారానికి అవసరమైన కీలకమైన పనులన్నింటినీ రోబోతోనే
చేయిస్తోంది బీజేపీ. మరో విశేషం ఏంటంటే...ప్రచార నినాదాలను ముందుగా రికార్డ్ చేసి ఇందులో అమర్చారు. ప్రచార సమయంలో ఆ నినాదాలను వినిపిస్తూ చకచకా దూసుకుపోతోంది రోబో. ఈ రోబోను తయారు చేసిన హర్షిత్ పటేల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "ఈ రోబో ప్రజలందరికీ పాంప్లెట్స్ పంచి పెడుతుంది. డోర్ టు డో క్యాంపెయిన్‌లోనూ దీన్ని వినియోగిస్తున్నాం. ప్రచార నినాదాలనూ రికార్డ్ చేసి అమర్చాం" అని చెప్పారు.
This robot distributes pamphlets to the public. We also use it for door-to-door campaigns, and Legislation Assembly's work, we have also attached speakers along with pre-recorded slogans for candidate campaigning: Harshit Patel, Robot manufacturer#GujaratElections2022 pic.twitter.com/9h5d9zp4Zt
— ANI (@ANI) November 18, 2022
మోడీ ప్లాన్..
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావటం వల్ల ఆయన ఈ ఎన్నికల్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పలుసార్లు రాష్ట్రంలో పర్యటించి అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ప్రచారంలోనూ వేగం పెంచేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 20 అధికారికంగా ప్రచారం కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.సౌరాష్ట్రలో మూడు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది బీజేపీ. వీటితో పాటు దాదాపు 30 వరకూ ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంది. గుజరాత్‌లో సౌరాష్ట్ర ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మొత్తం 182 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో...ఒక్క సౌరాష్ట్రలోని 48 నియోజక వర్గాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే...ఈ 48 సీట్లలో గెలవటం చాలా కీలకం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే...ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా పాటిదార్‌లు, ఓబీసీ వర్గానికి చెందిన వాళ్లుంటారు. గత ఎన్నికల్లో బీజేపీ పాటీదార్ల ఓటు బ్యాంకుని దక్కించు కోవడంలో విఫలమైంది. అప్పుడు కాంగ్రెస్‌కు ఆ ఓట్లన్నీ వెళ్లిపోయాయి. ఇప్పుడదే రిపీట్ కాకుండా చూసేందుకు బీజేపీ జాగ్రత్త పడుతోంది. అందుకే...ఈ ప్రాంతం నుంచే ప్రచారం మొదలు పెట్టనుంది.
అందులోనూ ఈ సారి పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఆ మేరకు కొంత వరకూ బీజేపీ వైపు సానుకూలత ఉండే అవకాశముంది. గత ఎన్నికల్లో పాటిదార్ ఉద్యమం కారణంగా...బీజేపీపై వ్యతిరేకత పెరిగి అందరూ కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ఫలితంగా...చెప్పుకోదగ్గ సీట్లు సాధించింది ఆ పార్టీ. ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు తక్కువేనంటున్నారు. ఇక బీజేపీని ఢీకొట్టేందుకు రెడీ అవుతున్న ఆప్ కూడా పాటిదార్ వర్గానికి చెందిన నేతనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి..బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టింది.