Gandhibaba Jatara : గాంధీబాబా జాతర, మహాత్మా గాంధీ వారసత్వాన్ని చాటుతోన్న గ్రామ ప్రజలు
Gandhibaba Jatara : మహారాష్ట్రలోని ఉజేద్ గ్రామంలో ఏటా జరుపుకునే గాంధీబాబా జాతరను జనవరి 25 నుంచి 3 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు.

Gandhibaba Jatara : గాంధీబాబా జాతర గురించి ఎప్పుడైనా విన్నారా.. చాలా మందికి ఈ పేరు గానీ, ఈ పండుగ గురించి వినడం ఇదే మొదటి సారి కావచ్చు. కానీ మహారాష్ట్రలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. గత 70ఏళ్ల నుంచి వారు ఈ జాతరను ఎంతో పవిత్రగా చేసుకుంటారు. ఈ వేడుకతో మహాత్మా గాంధీకి ప్రత్యేకమైన గౌరవాన్నిస్తారు. ఏటా జనవరి 25 నుంచి మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలను సాంస్కృతిక కార్యక్రమాలు, కుస్తీ పోటీలు, ఇతర ప్రదర్శనలతో సంబురంగా జరుపుకుంటారు.
ఏంటీ గాంధీబాబా జాతర.. ఎలా జరుపుకుంటారంటే..
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ఉజేద్ గ్రామం ఏటా గాంధీబాబా జాతరకు ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ గణతంత్ర దినోత్సవాన్ని వినూత్న రీతిలో జరుపుకుంటారు. దేవుళ్లను పూజించే ఓ మత పరమైన కార్యక్రమంలా కాకుండా జనవరి 25 నుంచి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. జాతర సమయంలో వీధులన్నీ రంగురంగుల జెండాలతో కలకలలాడతాయి. ప్రతి ఇంటిని రకరకాల ముగ్గులతో అలంకరించి, పండుగ వాతావరణాన్ని సృష్టిస్తారు. ఉజెద్ సర్పంచి నందిని జాదవ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన గాంధీజీ విగ్రహాన్ని ఉరేంగింపుగా గ్రామంలోని కూడలికి తీసుకువచ్చిన వేడుకలను ప్రారంభిస్తారు. ఈ ఏడాది జాతరలో వ్యవసాయ ప్రదర్శనలు, పిల్లలకు సంబంధించిన కొన్ని పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కుస్తీ పోటీలు వంటివి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి.
ఈ జాతర ఎప్పట్నుంచి మొదలైందంటే..
ఈ జాతర మూలాలపై కమిటీ అధ్యక్షుడు అనంత్ జాదవ్ పలు విషయాలను వెల్లడించారు. 1948కి ముందు ఉజెద్‌లో శివుడు, మొయిద్దీన్‌సాబ్ ఖాద్రీ గౌరవార్థం ఈ జాతరలు నిర్వహించినట్లు ఆయన పంచుకున్నారు. కానీ ఆ తర్వాత వీటిని నిలిపివేశారన్నారు. ఆరేళ్ల పాటు తమ గ్రామంలో ఎలాంటి జాతరలు నిర్వహించలేదన్నారు. అనంతరం మళ్లీ 1955లో, గ్రామ పెద్దలంతా సమావేశమైన మతపరం కాని జాతరను నిర్వహించాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఐక్యత, శాంతి, సామరస్యం వంటి విషయాలకు ఆదర్శంగా నిలిచిన గాంధీజీ జ్ఞాపకార్థం గణతంత్ర దినోత్సవం రోజున మహాత్మా గాంధీకి సంబంధించిన వేడుకను జరపాలని నిర్ణయించారని వివరించారు. గాంధీజీ పేరుతో ఉత్సవాలు జరపడం బహుశా దేశంలో ఇక్కడేనేమో అని అనంత్ చెప్పారు. కరోనా కారణంగా రెండేళ్లు మాత్రం ఈ వేడుకలు నిర్వహించలేదని, కానీ ఆ తర్వాత మాత్రం మళ్లీ ఏటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామన్నారు.
గాంధీబాబా జాతర మనకు కొత్తగా అనిపించినప్పటికీ ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ వేడుకల్లో భాగంగా జనవరి 27 చివరి రోజున నిర్వహించే కుస్తీ పోటీకి చుట్టుపక్కల గ్రామాల నుంచి గణనీయమైన జనం తరలివస్తారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ ఉత్సవాలు ఏ పాటి పేరును గడించాయో. ఏటా నిర్వహించే ఈ జాతర జాతిపిత వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా గ్రామస్థులలో మత సామరస్యాన్ని, దేశభక్తిని పెంపొందిస్తుందని చాలా మంది నమ్ముతారు.
Also Read : Adani: అదానీ గ్రూప్‌కు మరో షాక్ - విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసుకున్న శ్రీలంక
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

