G20 Summit: దేశాధినేతల భాగస్వాములను ఆకట్టుకున్న మిల్లెట్ రంగోలి
G20 Summit: కొర్రలు, సామలు, ఊదలు, రాగులు, మినుములు, సజ్జలు, జొన్నలు ఇలా ఎన్నో రకాల చిరుధాన్యాల గురించి, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి అవగాహన కలిగేలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
దేశ రాజధాని దిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వివిధ దేశాల నుంచి దేశాధినేతలు భారత్‌కు విచ్చేసి సదస్సులో పాల్గొంటున్నారు. దాదాపు 19 దేశాల నుంచి ప్రపంచ నేతలు ఇక్కడికి విచ్చేశారు. చాలా వరకు వారితో వారి జీవిత భాగస్వాములు కూడా భారత పర్యటనకు వచ్చారు. అధినేతలంతా బిజీ బిజీగా సమావేశాల్లో పాల్గొంటుంటే మరి వారి భార్యలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా. వారికి ఎంతో చక్కగా మిల్లెట్స్ గురించి అవగాహన కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కొర్రలు, సామలు, ఊదలు, రాగులు, మినుములు, సజ్జలు, జొన్నలు ఇలా ఎన్నో రకాల చిరుధాన్యాల గురించి, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి అవగాహన కలిగేలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
భారత పర్యటనకు దేశాధినేతలతో వచ్చిన దాదాపు 15 మంది సతీమణులు, ఇతర అధికారులు ఈరోజు దిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్(ఐఏఆర్‌ఐ)ని సందర్శించారు. భారతీయ వ్యవసాయం గురించి, అందులో పురోగతి గురించి, మిల్లెట్స్ గురించి ఎన్నో విషయాలు వారు తెలుసుకున్నారు. యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ సతీమణి, భారత్‌కు చెందిన అక్షతా మూర్తి కూడా ఐఏఆర్‌ఐకి వచ్చిన వారిలో ఉన్నారు. ఇంకా జపాన్ ప్రధాని భార్య యోకో కిషిడా, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా సతీమణి రీతు బంగా, ఇతర దేశాధినేతల భాగస్వాములు అక్కడికి వెళ్లారు. భారతదేశ హరితవిప్లవానికి కేంద్రంగా ఉన్న 1200 ఎకరాల ఐఏఆర్‌ఐ క్యాంపస్‌ను సందర్శించారు.
ఐఏఆర్‌ఐకు వెళ్లిన అతిథులకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ సతీమణి క్యోకో జయశంకర్ ఆత్మీయ స్వాగతం పలికారు. అలాగే క్యాంపస్‌లో తీర్చిదిద్దిన మిల్లెట్ రంగోలి అతిథులను ఎంతగానో ఆకట్టుకుంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, అభివృద్ధి చెందుతున్న స్టార్టప్స్, 18 దేశాల నుంచి తెప్పించిన వివిధ రకాల మిల్లెట్స్‌తో ఈ రంగోలిని తీర్చిదిద్దారు. ఈ రంగోలితో అతిథులకు స్వాగతం పలికారు. అలాగే ఎగ్జిబిషన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అగ్రి స్టార్టప్స్ వ్యవసాయంలో కింది స్థాయి సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న సాంకేతికతో వచ్చిన మార్గాలను వారికి తెలియజేశాయి. అలాగే దేశవ్యాప్తంగా విక్రయించే తినుబండారాలను ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ప్రదర్శించాయి. సామూహిక వ్యవసాయం ద్వారా గ్రామీణ శ్రేయస్సును సాధికారం చేయడం అనే థీమ్‌తో వ్యవసాయ శాఖ మంత్రి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో దీనిని పోస్ట్ చేశారు.
దాదాపు గంట పాటు ప్రతినిధులు ఐఏఆర్ఐ క్యాంపస్‌లో గడిపారు. అక్కడ లైవ్ కుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. మిల్లెట్స్ చేసే పలు రకాల వంటల గురించి తెలుసుకున్నారు. అక్కడ ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ అద్భుతమైన వంటకాలను వారికి అందించారు. 2023ని మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించాలని భారత్ కృషి చేస్తోంది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇప్పటికే 72 దేశాలు ఇందుకు మద్దతు తెలిపాయి.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‌లో భారతీయ రైతులు, వ్యవసాయ సాంకేతికత, హైడ్రోఫోనిక్ వ్యవసాయం, ఇతర పద్ధతుల గురించి అతిథులు తెలుసుకున్నారు. అలాగే మారుమూల గ్రామాల్లో మిల్లెట్స్ పండిస్తున్న సుమారు ఇరవై మంది మహిళా రైతులతో వారు మాట్లాడారు. అందులో మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన గిరిజన రైతు లహరీ బాయి కూడా ఉన్నారు. ఆమె మినుముల పంట గురించి గణనీయమైన కృషి చేశారు. మిగతా వారు కూడా తమ తమ ప్రాంతాల్లో మిల్లెట్స్ సాగు గురించి వారు వివరించారు. మధ్యప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాలలోని మారుమూల గ్రామాల నుంచి మహిళా రైతులు వచ్చారు. పోషకాహారంపై పరిశోధనల ద్వారా వ్యవసాయంపై సాధించిన పురోగతి గురించి వివరిస్తూ అక్కడ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మినుములతో పాటు డెయిరీ, ఫిషరీ, ఫ్లోరికల్చర్‌లో సాధించిన పురోగతిని ప్రదర్శనలో ప్రదర్శించారు. భారతీయ వ్యవసాయం గురించి తెలుసుకోవడానిక అతిథులు ఎంతో ఆసక్తి చూపించారని ఐఏఆర్‌ఐ డైరెక్టర్ ఏకే సింగ్ తెలిపారు.