Uniform Civil Code: నాకేమీ ఆశ్చర్యంగా అనిపించటం లేదు, భాజపాకు ఇది అలవాటే - యూసీసీపై అసదుద్దీన్
Uniform Civil Code: యూనిఫామ్ సివిల్ కోడ్ భాజపా ఎన్నికల స్టంట్ అని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
Uniform Civil Code:
ఆ సమస్యలు కప్పిపుచ్చుకునేందుకే..
గుజరాత్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఓ కమిటీని కూడా నియమించింది. వీలైనంత త్వరగా అమలు చేసేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో...ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. ఇదో ఎన్నికల స్టంట్ అని మండి పడుతున్నాయి. AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ వివాదంపై స్పందించారు. కేవలం గుజరాత్ ఎన్నికల్లో ఓట్లు దక్కించుకునేందుకు భాజపా ఈ వ్యూహంతో ముందుకొచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. "నాకిదేమీ ఆశ్చర్యం కలిగించటం లేదు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ భాజపా తమ రాజకీయాల కోసం ఇలాంటివి చేస్తూనే ఉంటుంది. ఇది ఊహించిందే. వాళ్లు ఇంతటితో ఆగరు. ఇంకెంతో చేస్తారు" అని విమర్శించారు. "భాజపా ఎప్పుడూ నిజమైన సమస్యలపై చర్చించదు. గుజరాత్‌లో కొవిడ్ సమయంలో వైరస్‌ను కట్టడి చేయటంలో దారుణంగా విఫలమయ్యారు. ఆక్సిజన్ పడకల కోసం ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. కొందరు చివరకు ప్రాణాలూ వదిలారు. ఇప్పుడు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కేవలం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC)ని తెరపైకి తీసుకొచ్చింది" అని అన్నారు అసుద్దీన్ ఒవైసీ. "యూసీసీని గిరిజన ప్రజలు ఎలా అంగీకరిస్తారు..? వాళ్లకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులు కొన్ని ఉన్నాయి. బీజేపీలో ఉన్న గిరిజన వర్గానికి చెందిన నేతలు దీన్ని అంగీకరిస్తారా" అని ప్రశ్నించారు. భారత్‌లో యూసీసీ అవసరం లేదని లా కమిషన్ ఇప్పటికే తేల్చి చెప్పిందని గుర్తు చేశారు అసదుద్దీన్ఒ వైసీ.
ప్రత్యేక కమిటీ..
గుజరాత్ ప్రభుత్వం Uniform Civil Codeని అమలు చేస్తుందన్న వార్తలు వినిపిస్తుండగానే...ఆ ప్రభుత్వం అధికారికంగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో ఈ కోడ్‌ను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించినట్టు స్పష్టం చేసింది. రాష్ట్ర కేబినెట్ ఈ కమిటీని నియమించేందుకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు సర్వాధికారాలు కట్టబెట్టింది. ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారన్నది త్వరలో సీఎం ప్రకటించనున్నారు. ఓ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైనట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీఎం భూపేంద్ర పటేల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. "ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం సుప్రీం కోర్టు, లేదా హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయనున్నాం. వాళ్లే దీనిపై ఓ ముసాయిదా తయారు చేస్తారు" అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సీఎం భూపేంద్ర పటేల్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: Kangana on Politics: కంగనాకు పార్టీలోకి స్వాగతం కానీ టికెట్ మాత్రం: నడ్డా