(Source: Poll of Polls)
పోలీసుల డ్రోన్‌లను అడ్డుకునేందుకు పతంగులు ఎగరేసిన రైతులు - వీడియో వైరల్
Farmers March: టియర్ గ్యాస్ ప్రయోగించే డ్రోన్స్‌ని అడ్డుకునేందుకు రైతులు పతంగులు ఎగరేశారు.
Farmers Protest: రైతుల ఆందోళనలతో హరియాణా, ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఛలో ఢిల్లీ మార్చ్ రెండో రోజుకి చేరుకుంది. దేశ రాజధానిలో రైతులు అడుగు పెట్టకుండా పోలీసులు ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. వేలాది మంది రైతులు వస్తుండడం వల్ల డ్రోన్స్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించి వాళ్లను అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే...రైతులు ఈ డ్రోన్‌లను అడ్డుకునేందుకు పతంగులు ఎగరేశారు. ఈ పతంగులతో డ్రోన్స్‌ని కట్టడి చేశారు. శంభు సరిహద్దు ప్రాంతం వద్ద రైతులు ఇలా పతంగులు ఎగరేస్తూ కనిపించారు. పంజాబ్ నుంచే భారీ మొత్తంలో రైతులు ఈ మార్చ్‌లో పాల్గొంటున్నారు. తమ పంటలకు కనీస మద్దతు ధరని చట్టబద్ధం చేయడంతో పాటు మరి కొన్ని సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. అంబాలాకి సమీపంలోని శంభు సరిహద్దు వద్ద రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాళ్లను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి అర్జున్ ముండా రైతులు ఆందోళనలు విరమించారని సూచించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఇలా నిరసనల్లో పాల్గొనద్దని విజ్ఞప్తి చేశారు. అటు కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరుగుతుండగానే ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Can you imagine that farmers are battling Modi govt’s tear gas shell firing drones with kites?
— Praveen (@praveenpscs) February 14, 2024
You can see in a video kite flown by a protesting farmer forced govt drone to retreat.
Yes, This is Basant Panchami and farmer pic.twitter.com/kVmv1SgneS
శంభు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్‌లను రైతులు ధ్వంసం చేశారు. వాటిని దాటుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. కానీ..అప్పటికే రైతులు టియర్ గ్యాస్ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు వాటర్ బాటిల్స్ సిద్ధం చేసుకున్నారు. తడిబట్టలతోనే రోడ్లపైకి వచ్చారు. కళ్లకు ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వం తీరుపై రైతు సంఘాల నాయకులు మండి పడుతున్నారు. సానుకూల వాతావరణంలో సమస్యలు పరిష్కరించాలని, చర్చలకు ఎప్పటికైనా తాము సిద్ధమే అని వెల్లడించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడాన్ని చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని అడిగారు. ఆ సమయంలో రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు కనీసం 6 నెలల పాటు ఆందోళనలు చేయాలన్న ప్లాన్‌తో వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆరు నెలలకు సరిపడా సరుకులు సిద్ధం చేసుకున్నారు. ట్రాక్టర్‌లకు అవసరమైన డీజిల్ కూడా తెచ్చుకున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సింగూ సరిహద్దు ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా ప్రభుత్వం అన్ని ఆసుపత్రులనూ అప్రమత్తం చేసింది.
#WATCH | Farmers' protest | Tear gas shells fired to disperse the agitating farmers who were approaching the Police barricade.
— ANI (@ANI) February 14, 2024
Visuals from Shambhu Border. pic.twitter.com/AnROqRZfTQ