అఫ్గనిస్థాన్ పాకిస్థాన్‌లోనూ భూకంపం, 11 మంది మృతి - వందలాది మందికి గాయాలు
Earthquake: అఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌లోనూ భూకంపం నమోదైంది.
Earthquake:
రాత్రి పూట కంపించిన భూమి..
ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో పలు దేశాల్లో భూకంపాలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల స్వల్పంగా మరి కొన్ని చోట్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం కలుగుతోంది. భారత్‌లోనూ ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఢిల్లీ, NCRలో భూమి కంపించింది. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రెండు చోట్లా రిక్టర్ స్కేల్‌పై 6.6 తీవ్రత నమోదైంది. ఈ రెండు దేశాల్లోనే కాకుండా మరి కొన్ని దేశాల్లోనూ భూమి కంపించింది. తుర్క్‌మెనిస్థాన్, కజకస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, కిర్గిజ్‌స్థాన్‌లోనూ ఈ ప్రభావం కనిపించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. రాత్రి 10 గంటలకు అఫ్గనిస్థాన్‌లో ఒక్కసారిగా భూమి కంపించినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. లగ్మన్ ప్రావిన్స్‌లో ఇద్దరు మృతి చెందినట్టు తెలిపారు. పాకిస్థాన్‌లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ 13 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఇల్లు కూలిపోయి పైకప్పు మీద పడటం వల్ల మృతి చెందింది. 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే...ఎంత మంది గాయపడ్డారన్న లెక్క ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆసుపత్రులు బాధితులతో నిండిపోయాయి. కొంత మంది గాయాలతో ఆసుపత్రులకు రాగా...మరి కొందరు సొమ్మసిల్లిపడిపోయారు. వీరందరికీ చికిత్స అందిస్తున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్...అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించాలని ఆదేశించారు. అటు అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. నిజానికి...ఈ ప్రాంతంలో ఎప్పుడూ భూకంపాలు నమోదవుతూనే ఉంటాయి. 2005లో భారీ భూకంపం సంభవించింది. వేలాది మంది చనిపోయారు.
#UPDATE Afghanistan, Pakistan jolted by 6.5-magnitude quake: USGS pic.twitter.com/OBvAKcpB4g
— AFP News Agency (@AFP) March 21, 2023
ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి కంపించింది. దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి ఢిల్లీ, నోయిడాతో పాటు ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. అదే సమయంలో పాకిస్తాన్ లోనూ రిక్టర్ స్కేలుపై దాదాపు 7 తీవ్రతతో పలు చోట్ల భూమి కంపించింది. ఇస్లామాబాద్, రావల్ఫిండి, లాహోర్ లోనూ కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై తీవ్రత తెలియాల్సి ఉంది. ఈ ఏడాది పలుమార్లు ఢిల్లీలో, నార్త్ ఇండియాలో భూకంపాలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని ఫైజా బాద్ కు 77 కి.మీ దూరంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు. రాత్రి 10.17నిమిషాలకు ఈ భూప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.రాత్రి 10 గంటల తరువాత ఉత్తరాది రాష్ట్రాలతో పలు ఆసియా దేశాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి కూర్చుని ఏం జరుగుతుందోనని, నిద్ర పోవాలో వద్దోనని వీధుల్లోనే ప్రజలు కనిపించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: ఢిల్లీలో వేలాది "మోదీ హఠావో" పోస్టర్లు, నలుగురు అరెస్ట్ - సమర్థించిన ఆప్