Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి సారి ఇద్దరికి బెయిల్ - వాళ్లిద్దరు ఎవరంటే ?
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరికీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన వారిలో ఇద్దరికి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ స్కాంలో ఈడీ అరెస్ట్ చేసిన వారికి ఇప్పటి వరకూ ఎవరికీ బెయిల్ లభించలేదు. తొలిసారిగా రాజేష్ జోషి,గౌతమ్ మల్హోత్రాకి ఈడి కేసులో బెయిల్ మంజూరు చేసింగి రౌస్ అవెన్యూ కోర్టు. ఒక్కొక్కరు రెండు లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని షరతు మంజూరు చేసింది. ఫిబ్రవరి 7న అరెస్ట్ అయిన గౌతమ్ మల్హోత్రా,ఫిబ్రవరి 8న అరెస్ట్ రాజేష్ జోషిని ఈడీ అరెస్ట్ చేసింది. చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యజమానిగా ఉన్న రాజేష్ జోషి..ఢిల్లీ లిక్కర్ స్కాం నగదు లావాదేవీల్లో కీలక పాత్ర పోషించినట్లుగా గుర్తించారు. ఆర్ధిక లావాదేవీలు, హవాలా లావాదేవీల్లో పాల్గొన్నారని చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పై కేసు పెట్టి రాజేష్ జోషిని అరెస్ట్ చేశారు.
ఈ నగదు ను.. 2022 గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఖర్చు చేసినట్లుగా ఈడీ ఆధారాలు సేకరించింది. ఇప్పటికే రాజేష్ జోషి,గౌతమ్ మల్హోత్రా ఇద్దరిపై అభియోగాలు నమోదు చేసింది. కేసు దర్యాప్తుకు సహకరిస్తున్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేస్తున్నామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. గౌతమ్ మల్హోత్రా పై ఈడీ నమోదు చేసిన అభియోలు చాలా సీరియస్ గా ఉన్నాయి. ఫిబ్రవరి 8న ఢిల్లీ లిక్కర్ స్కాంలో గౌతమ్ మల్హోత్రాను అరెస్ట్ చేసింది. గౌతమ్.. అక్రమ లావాదేవీలు జరిపినట్లు గుర్తిచింది. రాజేష్ జోషి సౌత్ గ్రూపునకు రూ.31 కోట్ల నగదును బదిలీ చేయడంలో రాజేష్ జోషి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీ ఈ డబ్బును ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి నగదును ఢిల్లీకి తరలించారని గుర్తించారు.
ఆప్ సర్కార్ నిర్ణయం మేరకు.. 2021 జనవరి 5న లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంలో ఓ కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాశ్ గెహ్లాట్ ఈ బృందంలో ఉన్నారు. అయితే.. వాళ్లంతా కలిసి.. రెండు నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు. ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్.. మే 21, 2021న ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదించింది. అక్కడే అసలు రచ్చ మొదలైంది. ఈ కొత్త లిక్కర్ పాలసీలో.. విదేశీ మద్యం ధరలపై ఆప్ సర్కార్ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా వ్యతిరేకించారు. కానీ.. అవేవి పట్టించుకోకుండా ప్రభుత్వం దాన్ని ఆమోదించటంపై ఆయన పలు ఆరోపణలు చేశారు. తర్వాత సీబీఐ విచారణకు ఆదేశించి. సీబీఐ విచాణలో వెల్లడయిన విషయాలతో.. ఈడీ కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి వంటి వారు కూడా అరెస్టయ్యారు. శరత్ చంద్రారెడ్డి తన భార్య అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ పై ఉన్నారు.