Covid-19 Cases Kerala: కేరళపై మరోసారి కొవిడ్ పంజా, క్రమంగా పెరుగుతున్న కేసులు
Covid-19 Cases Kerala: కేరళలో మరోసారి కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
Covid-19 Cases in Kerala:
కొత్త కేసులు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ...ప్రస్తుతానికి భారత్‌లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. కానీ...కేరళలో మాత్రం కొవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఈ డిసెంబర్ 23వ తేదీ వరకూ లెక్కలు గమనిస్తే...మొత్తం కొవిడ్ మరణాల్లో 83% మేర కేరళలోనే నమోదయ్యాయి. 38% మేర కొత్త కేసులు నమోదైంది కూడా ఇక్కడే. ఈ నెల 19-25 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కేసులు ఉన్నట్టుండి పెరిగాయి. 1,291 కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే...ఈ సంఖ్య తక్కువగానే అనిపిస్తున్నా...కేరళలోనే ఎక్కువ మంది బాధితులు ఉండటం కలవర పెడుతోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై మళ్లీ కరోనా ఆంక్షలు విధిస్తున్నాయి. ఎవరికి పాజిటివ్ అని తేలినా వెంటనే ఆ శాంపిల్స్‌ని పరీక్షిస్తున్నాయి. చైనాలో వ్యాప్తి చెందుతున్న BF.7 వేరియంట్ భారత్‌లోనూ వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్‌కు అధికంగా వ్యాప్తి చెందే లక్షణం ఉందని ఇప్పటికే శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే....కేరళలో కేసులు పెరుగుతుండటం మరో విపత్తుని సూచిస్తోందా అన్న ఆందోళన చెందుతున్నారు. జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికాతో సహా దేశాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. చైనాలో కరోనా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. గుజరాత్‌లో ముగ్గురికి, ఒడిశాలో ఒకరికి BF.7 కరోనా వేరియంట్ ఇప్పటికే నిర్ధరణ అయింది. చైనాలో కరోనా మరణమృదంగం వాయిస్తోంది. నిత్యం వేల మంది కొవిడ్ కారణంగా చైనాలో ప్రాణాలు కోల్పోతున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ చైనా మాత్రం గత వారం రోజుల్లో కేవలం ఒకే ఒక్క మరణం నమోదైందని చెబుతోంది. కానీ ఇది అబద్ధమని తెలుస్తోంది. ఎందుకంటే చైనాలో శ్మశానాల వద్ద భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి.
హై అలర్ట్..
వైరస్‌ల హబ్‌గా మారుతున్న కేరళ ప్రభుత్వం అలెర్ట్ అయింది. అన్ని జిల్లాల వైద్యాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాజిటివ్‌గా తేలిన వారందరి వైరస్ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని తేల్చి చెప్పింది. ఏ వేరియంట్ వ్యాప్తి చెందుతోందో వీలైనంత త్వరగా గుర్తించాలని వెల్లడించింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆధ్వర్యంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ సమావేశమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది ప్రభుత్వం. ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్క్‌లు ధరించాలని చెప్పింది. ప్రజలకు మరి కొన్ని జాగ్రత్తలూ చెప్పింది. "సబ్బు లేదా నీళ్లతో తరచూ చేతులు కడుక్కోండి. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకోని వారు...తప్పకుండా టీకాలు తీసుకోండి. ప్రికాషన్ డోస్ తీసుకోని వాళ్లు కూడా వెంటనే తీసుకోవాలి. కొవిడ్ సోకిన వాళ్ల వైరస్ శాంపిల్స్‌ని తప్పకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. అలా అయితేనే కొత్త వేరియంట్లను గుర్తించి కట్టడి చేసేందుకు వీలవుతుంది" అని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన వసతులనూ కల్పించేందుకు సిద్ధమవుతున్నారు వైద్యాధికారులు.
Also Read: RBI Report on Banking in India: బ్యాంకులు భళా - మెరుగుపడ్డ బ్యాలెన్స్ షీట్లు, తగ్గిన మొండి రుణాలు