Congress Mission 2024: కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ పెంచిన కర్ణాటక విక్టరీ, 2024 కుంభస్థలాన్నీ కొట్టేందుకు రెడీ!
Congress Mission 2024: కర్ణాటక విక్టరీతో 2024 లోక్‌సభ ఎన్నికలకు మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది కాంగ్రెస్.
Congress Mission 2024:
మిషన్ 2024
కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడాన్ని "సింపుల్"గా కొట్టిపారేయలేం. సౌత్‌లో బీజేపీ ప్రాతినిధ్యం ఉన్న ఒకే ఒక రాష్ట్రాన్ని కూడా హస్తగతం చేసుకుని...ఆ పార్టీ మిషన్‌కి బ్రేక్ వేసింది కాంగ్రెస్. "కాంగ్రెస్ ఓ ఫెయిల్యూర్ ఇంజిన్ పార్టీ..మాది డబుల్ ఇంజిన్ పార్టీ" అని ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ...ఫలితాలు హస్తం పార్టీకే అనుకూలంగా వచ్చాయి. మోదీ చరిష్మాను గట్టిగా నమ్ముకున్న బీజేపీ..ఈ ఓటమి చిన్న విషయమేమీ కాదు. బీజేపీ అంటే "మోదీ మాత్రమే కాదు" అనే సంకేతాలిచ్చింది. లోకల్‌గా ప్రభుత్వంపై సానుకూలత లేకపోతే...ప్రధాని స్థాయి వ్యక్తిని ముందుంచి ప్రచారం చేసినా సక్సెస్ కాలేం అని తేల్చి చెప్పింది. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గుజరాత్‌ని కోల్పోయినా..హిమాచల్‌లో పట్టు సాధించింది కాంగ్రెస్. మళ్లీ ఇప్పుడు కర్ణాటక. అంటే..క్రమంగా బీజేపీ మేనియాను తట్టుకుని నిలబడగలుగుతోంది. క్యాడర్‌ని బలోపేతం చేసుకుంటోంది. ఇది మూన్నాళ్ల ముచ్చటే అయితే..మళ్లీ కథ అంతా మొదటికే వస్తుంది. కానీ...ఈ సారి గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గతంలో కన్నా స్ట్రాటెజికల్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రచార శైలి కూడా మార్చేశారు. రాహుల్‌ని ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై చేసిన విమర్శలు గట్టిగానే పేలాయి. ఇప్పుడు కర్ణాటక విషయంలోనూ వీళ్లద్దరి స్ట్రాటెజీ వర్కౌట్ అయింది. అందుకే అప్పుడెప్పుడో 1999లో వచ్చిన మెజార్టీ కంటే భారీగా సీట్లు వచ్చాయి ఈ సారి.
"2024 ఎన్నికల్లో మోదీ మేజిక్ పని చేయదు" అని ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అంతా చాలా గట్టిగా చెబుతున్నారు. కర్ణాటక విక్టరీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఇది. వచ్చే ఎన్నికల్లో "మాస్టర్" ఎవరో తేల్చుకుందాం అని సవాలు కూడా విసురుతున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ చేసిన కామెంట్స్‌నే తీసుకుందాం.
"బీజేపీకి ఉన్న ఒకే ఒక్క ఇమేజ్ ప్రధాని నరేంద్ర మోదీ. అంతకు మించి ఆ పార్టీకి బలం లేదు. ఆయనే వచ్చి స్వయంగా ప్రచారం చేసినా కర్ణాటకలో ఆ పార్టీ గెలవలేకపోయింది. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అంటే...ప్రధాని మోదీ కాంగ్రెస్ చేతుల్లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుంది. ఇప్పటికే మేం ప్లాన్ రెడీ చేశాం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టే..లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం. 2024 ఎన్నికలకు ఢిల్లీ ద్వారాలు తెరుచుకున్నాయి. విజయం సాధించి అక్కడ అడుగు పెడతాం"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
అటు విపక్ష నేతలు కూడా బీజేపీ ఓటమిని ఆస్వాదిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా ఎన్‌సీపీ, థాక్రే శివసేన...ఇలా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ సంబరాలు చేసుకుంటున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటమి తప్పదని తేల్చి చెబుతున్నాయి. కాంగ్రెస్ విజయం కేవలం ఆ పార్టీకే కాదు...విపక్షాలన్నింటికీ బూస్ట్ ఇచ్చిందని స్పష్టమవుతోంది.