Chinese President Election: చైనాపై సర్వాధికారాలు జిన్‌పింగ్‌వే, అధికారికంగా ప్రకటించిన కమ్యూనిస్ట్ పార్టీ
Chinese President Election: చైనాకు మూడోసారి ప్రెసిడెంట్‌గా జిన్‌పింగ్‌ను కొనసాగిస్తూ ఇవాళ అధికారికంగా ప్రకటించారు.
Chinese President Election:
మూడోసారి అధ్యక్షుడిగా..
చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ (CPC) ముగిసింది. 20వ నేషనల్ కాంగ్రెస్ నిన్నటితో పూర్తైంది. దాదాపు వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. ఆరు రోజుల వరకూ అంతా సవ్యంగానే సాగినా..చివరి రోజు నాటకీయ పరిణామాలు జరిగాయి. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మూడోసారి అధ్యక్షుడిగా ఆమోదిస్తూ అంతా తీర్మానం చేశారు. అధికారికంగా ఈ రోజు ప్రకటించారు. నిజానికి...ఇలా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగించాలంటే పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి ఉంటుంది. జిన్‌పింగ్‌కు సర్వాధికారాలు కట్టబెడుతూ రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసింది సెంట్రల్ కమిటీ. పొలిట్‌బ్యూరో సభ్యుల్ని ఎన్నుకునేందుకు ఇప్పటికే పోలింగ్ పూర్తైంది. మొత్తం 25 మంది సభ్యులు ఈ బ్యూరోలో ఉంటారు. 7గురు సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీని ఇవాళ ప్రకటించనున్నారు. సీసీపీ కొత్త టీమ్‌లో తనకు గిట్టని వాళ్లందరినీ తొలగించారు జిన్‌పింగ్. కేవలం తనకు నమ్మకస్థులుగా ఉన్న వారికే అవకాశమిచ్చారు. సెంట్రల్ కమిటీలోని 370 మంది సీనియర్ లీడర్స్ కొన్ని కీలక తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు పార్టీ రాజ్యాంగంలోనూ సవరణలు చేశారు. జిన్‌పింగ్‌కి సర్వాధికారాలు కట్టబెట్టే సవరణలు ఇవి. కమ్యూనిస్ట్ పార్టీకి గవర్నింగ్ బాడీగా ఉండే సెంట్రల్ కమిటీ...దేశవ్యాప్తంగా ఎలాంటి విధానాలు అమలు చేయాలో స్పష్టంగా వివరిస్తుంది. అంతే కాదు. వచ్చే ఐదేళ్లలో ఎలాంటి మార్పులు చేయాలన్నదీ సూచిస్తుంది. ఈ క్రమంలోనే జిన్‌పింగ్‌ను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకునేలా మార్పులు చేశారు. ఇదే విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.
కావాలనే చేశారా..?
ముగింపు కార్యక్రమంలో అనూహ్య ఘటన జరిగింది. చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో ( Hu Jintao)ను ఉన్నట్టుండి హాల్‌లో నుంచి బయటకు పంపేశారు. గ్రేట్ హాల్‌లో ముందు వరసలో అధ్యక్షుడు జిన్‌పింగ్ కూర్చోగా..ఆయన పక్కనే మాజీ అధ్యక్షుడు హు జింటావో కూర్చున్నారు. స్టాఫ్ మెంబర్స్ అక్కడికి వచ్చి జింటావోతో ఏదో మాట్లాడారు. మొదటి ఓ వ్యక్తి వచ్చి ఆయనకు వివరించారు. అయితే...ఆయన అక్కడి నుంచి వెళ్లేందుకు అంగీకరించలేదు. ఆ తరవాత మరో ఇద్దరు సిబ్బంది వచ్చి మాట్లాడారు. ఓ వ్యక్తి జింటావోకు సపోర్ట్ ఇచ్చి కుర్చీలో నుంచి లేపారు. మరో ఇద్దరు ఆయనకు రెండు వైపులా నిలబడి గట్టిగా పట్టుకున్నారు. కాసేపు మాట్లాడిన తరవాత ముందుకు కదిలారు. వెళ్లే ముందు జిన్‌పింగ్‌తోనూ ఏదో చెప్పారు. ఆ తరవాత సిబ్బంది ఆయనను నడిపించుకుంటూ తీసుకెళ్లి బయటకు పంపారు. హాల్‌లో దాదాపు రెండు నిముషాల పాటు అందరూ మౌనంగా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేయగా...వైరల్ అవుతోంది. జింటావో సపోర్టర్స్ మాత్రం..ఆయనకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే హు జింటావోను...జిన్‌పింగ్ పక్కకు తప్పించారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాదితో జిన్‌పింగ్ అధ్యక్ష పదవీ కాలానికి పదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మరో ఐదేళ్ల పాటు ఆయననే కొనసాగనున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తరవాత వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగిన నేతగా జిన్‌పింగ్ చరిత్రలో నిలిచిపోనున్నారు.
Also Read: BJP Fires on KTR: మంత్రి కేటీఆర్ మోడీ చమురు కామెంట్స్ - అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి