Viral News: అమ్మపై కోపంతో 130 కి.మీ. సైకిల్ తొక్కిన బాలుడు, నానమ్మకు కంప్లెయింట్ చేయడానికి వెళ్లాడట
Viral News: అమ్మపై కోపంతో నాయనమ్మకు కంప్లెయింట్ చేయడానికి ఓ బాలుడు 120 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు.
Viral News:
అమ్మతో గొడవ
ఈ రోజుల్లో పిల్లలు మరీ మొండిగా తయారవుతున్నారు. స్కూల్లో టీచర్ కాస్త కోపంగా చూసినా సరే తట్టుకోలేకపోతున్నారు. ఇక ఇంట్లో అయితే ఇష్టారాజ్యమే. అమ్మ, నాన్న కోప్పడితే ఇల్లంతా పీకి పందిరి చేసేస్తారు. ఆ కోపంలో ఎంతకైనా తెగిస్తారు. చైనాలో ఓ 11 ఏళ్ల బాలుడు ఇదే చేశాడు. అమ్మతో గొడవ పడ్డాడు. ఇంట్లో ఉండటం ఇష్టం లేక వెంటనే బయటకు వచ్చాడు. ఇంటి ముందు సైకిల్ కనిపించింది. ఎక్కి తొక్కడం మొదలు పెట్టాడు. అలా తొక్కుతూ వెళ్తూనే ఉన్నాడు. దాదాపు 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. ఎందుకో తెలుసా..? వాళ్ల నాయనమ్మకు అమ్మపై కంప్లెయింట్ చేయడానికి. 24 గంటల పాటు సైకిల్ తొక్కుతూ తన నాయనమ్మ ఇంటికి వెళ్లాడంటే...ఎంత మొండోడో అర్థమైందిగా. ఏ ఎక్స్‌ప్రెస్ వే టన్నెల్‌లో ఈ బాలుడు ఒంటరిగా కనిపించాడని స్థానికులు చెప్పారు. ఓ చోట అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కొందరు బాలుడిని గమనించారు. మరో గంటలో నాయనమ్మ ఇంటికి చేరుకుంటామనగా... రూట్ మర్చిపోయి నానా ఇబ్బందులు పడ్డాడు బాలుడు.
బ్రెడ్ తింటూ ప్రయాణం
పలుసార్లు రాంగ్ రూట్‌లోకి వెళ్లాడు. అలా చాలా సేపు ప్రయాణించి అలిసిపోయాడు. ఇంత సేపు ప్రయాణించాడు సరే. మరి తిండి తిప్పల సంగతేంటి..? అంటారా. ఆ ప్రశ్నకూ సమాధానం చెప్పాడు ఆ బాలుడు. సైన్ బోర్డ్‌ల ఆధారంగా ప్రయాణం చేస్తూ వచ్చిన ఈ బాలుడు ఆకలి తీర్చుకునేందుకు బ్రెడ్ తిన్నాడు. ఇదంతా జరిగాక తెలిసిందేంటంటే..గతంలో చాలా సార్లు అమ్మతో గొడవ పడ్డాడు. ప్రతి సారి "నేను నాయనమ్మ ఇంటికి వెళ్లిపోతాను" అని బెదిరించాడట. ఎప్పుడూ అలా జరగలేదు. ఈ సారి కూడా అదే విధంగా బెదిరించాడట. ఇది కామనే కదా అని ఆ తల్లి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ సారి మాత్రం షాక్ ఇచ్చాడు. ఇలా ప్రయాణం చేసి చేసి అలిసిపోయి ఓ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు బాలుడు. ఈ సంగతంతా తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడి నాయనమ్మ, తాతయ్యకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి బాలుడిని ఇంటికి తీసుకెళ్లారు. మొత్తానికి ఈ పిల్లోడు రెండు కుటుంబాలను టెన్షన్ పెట్టేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.