China Earthquake: చైనాలో భారీ భూకంపం- 100 మందికిపైగా మృతి
China Earthquake: వాయవ్య చైనాలోని గన్సు, క్వింఘై ప్రావిన్సుల్లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా 100 మందికిపైగా మరణించినట్లు సమాచారం.
China Earthquake Update: వాయవ్య చైనాలోని గన్సు, క్వింఘై ప్రావిన్సుల్లో భూకంపాలు సంభవించాయి. చైనా వార్తా సంస్థ నివేదిక ప్రకారం భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 111 దాటింది.
భూకంప ప్రకంపనల కారణంగా గన్సు, క్వింఘై ప్రావిన్సుల్లో 200 మందికిపైగా గాయపడ్డారు. పొరుగున ఉన్న క్వింఘై ప్రావిన్స్‌లోని హైడాంగ్ నగరంలో కూడా తొమ్మిది మంది మరణించారని, 124 మంది గాయపడ్డారని వార్తా సంస్థలు చెబుతున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భూకంపానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు చైనా అధికారిక వార్తా మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. బాధితులకు సరైన పునరావాసం కల్పించాలని ఆదేశించారు. శిథిలాల కింద ఉన్న వారిని వీలైన వేగంగా వెలికి తీసిక చికిత్స అందించాలని అన్నారు.
బలమైన ప్రకంపనల కారణంగా చాలా ఇళ్లు కూలిపోయాయని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మరికొన్ని పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. భూ ప్రకంపనలు వచ్చిన వెంటనే ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి వీధుల్లోకి వచ్చారు.
భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం కారణంగా కొన్ని స్థానిక గ్రామాలకు విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. క్వింఘై ప్రావిన్స్ సరిహద్దుకు సమీపంలో ఉన్న గన్సు ప్రావిన్స్‌లో ఈ భూకంపం సంభవించిందని నివేదిక తెలిపింది. కూలిన పైకప్పులు, ఇతర శిథిలాలను చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం
సోమవారం రాత్రి 10:11 గంటలకు 59 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని. తొలుత 10.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్జీఎస్ తెలిపింది. భూకంపం సంభవించిన వెంటనే అధికారులు అత్యవసరంగా స్పందించి సహాయక సిబ్బందిని భూకంప ప్రభావిత ప్రాంతానికి పంపినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. యుఎస్జిఎస్ నివేదిక ప్రకారం గాన్సు ప్రావిన్స్ రాజధాని లాంఝౌకు నైరుతి దిశలో 2 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించారు. దీని తరువాత అనేక చిన్న ప్రకంపనలు సంభవించాయి.
చైనాలో భూకంపాలు రావడం మామూలే. మొన్న ఆగస్టులో తూర్పు చైనాలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇందులో 23 మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి.