Chandrababu Comments: వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వం- జగన్ కు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం: చంద్రబాబు
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
TDP Yuvagalam Navashakam meeting: విజయనగరం: ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) ధీమా వ్యక్తం చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలని.. టీడీపీ, జనసైనికులు కలిసి పనిచేస్తే ఇది సాధ్యమన్నారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన యువగళం నవశకం భారీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ పాలనపై, సీఎం జగన్ (AP CM YS Jagan) పై నిప్పులు చెరిగారు. జాబ్ క్యాలెండర్ (AP Job Calendar) అని మభ్యపెట్టిన జగన్.. ఐదేళ్లే గడిచినా జాబ్ క్యాలెండర్ లేదు, జాబులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం, జనసేన రాష్ట్ర ప్రజలకు, యువతకు అండగా ఉంటుందని, ఉద్యోగాలు కల్పిస్తుందని భరోసా కల్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగుతమ్ముళ్లకు, జనసైనికులకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
226 రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యల్ని నారా లోకేష్ అధ్యయనం చేశారన్నారు. దేశంలో పాదయాత్రలు, బస్సు యాత్రలు కొత్త కాదు, ప్రజల్ని చైతన్యం చేయడానికి నందమూరి తారకరామారావు చైతన్యయాత్ర చేశారు. కానీ పాదయాత్రలపై దండయాత్ర చేయడం తొలిసారి జగన్ పాలనలో చూశానంటూ మండిపడ్డారు. ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు నేత పాదయాత్ర చేస్తే, చేతనైతే సహకరించాలి.. లేకపోతే ఇంట్లో పడుకోవాలన్నారు. యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ నేతల్ని ఇబ్బందులకు గురిచేసింది వైసీపీ ప్రభుత్వం. త్వరలో అధికారంలోకి వచ్చి వడ్డీతో సహా జగన్ కు తిరిగిస్తామన్నారు.
లోకేష్ కు అభినందనలు..
ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు పాదయాత్ర చేసిన నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అభినందించారు. ప్రజాగళమే యువగళం అయిందని కొనియాడారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు ప్రజల కోసం చేస్తున్న పనుల్ని అభినందించారు. రాజకీయ వ్యతిరేకత ఉండాలి కానీ, వ్యక్తిగత కక్షలు ఉండకూడదని సూచించారు.
విజయనగరం భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం భూములు సేకరించాం. టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింటే 2020కే విమానాశ్రయం వచ్చేది. గత ఐదేళ్లలో వైసీపీ కేవలం కబ్జాలు చేసిందని, ప్రజలు ఇది గుర్తించాలన్నారు. జనసేన, టీడీపీ కోసం కాదు ఏపీ భావితరాల కోసం, 5 కోట్ల ప్రజల కోసం ఆలోచించాలన్నారు. మెట్రో పోయింది, విశాఖకు వచ్చే కంపెనీలు వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చింది. హెచ్ఎస్‌బీసీ ఐటీ కంపెనీ సైతం వెల్లిపోతే స్థితిలో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయంటూ నిప్పులు చెరిగారు. మెడ మీద కత్తిపెట్టి ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారంటే మనం ఎటుపోతున్నామని ప్రశ్నించారు.
ఒకప్పుడు ఆర్థిక రాజధాని, నేడు గంజాయి రాజధానిగా మారిపోయింది. తనకెంతో ఇష్టమైన నగరం, ప్రాంతం విశాఖపట్నం అన్నారు. హుదూద్ తుఫాను వచ్చిన సమయంలో పది రోజులు ఇక్కడ ఉండి, విశాఖను మళ్లీ కొత్త నగరంగా చేశామన్నారు. విధ్వంస పాలనకు ఏపీ సీఎం నాంది పలికారు. మంచి చేయకపోయినా సరే, నాశనం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఏపీని చూస్తే అర్థమవుతుందన్నారు. ఒక్క ఛాన్స్ పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు.
పవన్ కళ్యాణ్ ఓ మాట చెప్పారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ఏపీని కాపాడుకోలేం అన్నారు. ఆయన మాటల్లో వంద శాతం నిజం ఉంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. 5 ఏళ్లు కష్టపడి రోడ్డు వేశాం, కానీ గత ఐదేళ్లు ఏపీలో ఎలాంటి అభివృద్ది చేయకపోవడంతో పాటు సర్వనాశనం చేసిన ఘనుడు జగన్ అని పేర్కొన్నారు.
Also Read: ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతులకు రూ.20 వేల సాయం: చంద్రబాబు హామీలు