Pahalgam attack: పాకిస్తాన్ పౌరుల అన్ని వీసాల రద్దు - దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు
Pakistani nationals: భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. వారి వీసాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Pakistani nationals asks them to leave India: కశ్మీర్‌లోని పహల్గాంలో భారత టూరిస్టులపై ఉగ్రదాడిపై భారత్ కఠినంగా స్పందిస్తోంది. తాజాగా గురువారం కేంద్ర ప్రభుత్వం పాకిస్తానీ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసింది. అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. దేశంలో పాకిస్తానీ జాతీయులు భారతదేశం విడిచి వెళ్లాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయులు పాకిస్తాన్‌కు వెళ్లద్దని కూడా MEA సూచించింది. 27వ తేదీలోపు అందరూ వెళ్లాల్సి ఉంటుంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తెస్తున్నారు. ఆ సమావేశంలో పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు భారతదేశం జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు 27 ఏప్రిల్ 2025 నుండి రద్దు చేశారు. పాకిస్తాన్ జాతీయులకు జారీ చేసిన వైద్య వీసాలు 29 ఏప్రిల్ 2025 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఈ లోపు అందరూ దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.
In continuation of the decisions made by the Cabinet Committee on Security in the wake of the Pahalgam terror attack, the Government of India has decided to suspend visa services to Pakistani nationals with immediate effect. All existing valid visas issued by India to Pakistani… pic.twitter.com/P2Du6Dvc9Q
— ANI (@ANI) April 24, 2025
ప్రకటించిన వీసా గడువు ముగిసేలోపు భారతదేశంలో ఉన్న అన్ని పాకిస్తానీ జాతీయులు దేశం విడిచి వెళ్లాలని MEA ప్రకటన పేర్కొంది.
పాకిస్తాన్‌లోని అన్ని భారతీయులను ప్రభుత్వం వెంటనే తిరిగి రావాలని కోరింది. భారతీయ పౌరులు పాకిస్తాన్‌కు వెళ్లకుండ ఉండాలని ప్రభుత్వం సలహా ఇచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న భారతీయ పౌరులు కూడా వీలైనంత త్వరగా భారతదేశానికి తిరిగి రావాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉగ్రదాడికి పాకిస్తాన్ మద్దతు ఉందని స్పష్టం కావడంతో భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా మన దేశంలో పర్యటిస్తున్న పాకిస్థాన్ జాతీయులకు అనుమతుల రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. భారత్‌లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తోన్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశం వీడి వెళ్లేందుకు వారం రోజుల గడువు విధించారు. పాక్ దౌత్యవేత్తకు సమన్లు ఉన్నారు. భారత్ ఆదేశాలతో ఏ రకమైన వీసాపై భారత్ లో ఉన్నప్పటికీ వారంతా పాకిస్తాన్ తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది.





















