Indus Water Treaty:సింధు జలాల ఒప్పందం రద్దుపై ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుంటుందా? ఒప్పందంలో ఉన్న కీలకాంశాలు ఏంటీ?
Indus Water Treaty:పహల్గాం దాడితో పాకిస్థాన్‌పై ఇండియా ప్రచ్చన్న యుద్ధం ప్రకటించింది. ఆ దేశాన్ని ఎడారిగా మార్చే కీలక నిర్ణయంపై ప్రపంచబ్యాంకు జోక్యం చేసుకుంటుందా?

Indus Water Treaty: పహల్గాం దాడితో పాకిస్థాన్‌పై ఇండియా నీటి యుద్ధానికి దిగింది. దీని పర్యవసానం పాకిస్థాన్ ఓ ఏడారిగా మార్చడమేనని చెప్పాలి. పాకిస్థాన్‌ను ఆర్థికంగా నడ్డి విరిచే నిర్ణయం కేంద్ర సర్కార్ తీసుకుంది. 1960లో ఇండియా- పాక్ మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో ఈ ఒప్పందం జరిగింది. అయితే అసలు ఈ ఇండస్ వాటర్ ట్రిటీ ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం.
ఇండస్ వాటర్ ట్రీటీ ముఖ్య అంశాలు
1. ఇండియా పాక్ మధ్య నదీ విభజన
ఒకప్పుడు ఒకే దేశంగా ఉన్న ఇండియా - పాకిస్తాన్ విభజన తర్వాత నీటి వినియోగంపై ఏర్పాటు చేసుకున్న అవగాహన ఒప్పందమే సింధు జలాల పంపిణీ ఒప్పందం. ఇందులో భాగంగా ఇండస్ నదీ వ్యవస్థలో తూర్పుకు పారే బియాస్, రావి, సట్లెజ్ నదులు మన దేశం వినియోగించుకోవాల్సి ఉంది. ఇక పశ్చిమ వైపుగా ప్రవహించే ఇండస్, చీనాబ్, జీలం నదుల నీటిని పాకిస్థాన్ వినియోగించుకోవాల్సి ఉంది. అయితే కొన్ని షరతులతో తూర్పు నదుల నీటిని పరిమితంగా పాకిస్థాన్, పశ్చిమ నదుల నీటిని ఇండియా వాడుకునే అవకాశాన్ని ఈ ఒప్పందంలో కల్పించారు. పరిమితంగా అంటే విద్యుత్ ఉత్పత్తి కోసం, తాగు నీటి అవసరాలు, పరిశ్రమలకు ఈ నీటిని వినియోగించుకోవచ్చు. కానీ నీటి ప్రవాహాన్ని ఎక్కువ మొత్తంలో అడ్డుకునేలా ఏ దేశం కూడా గరిష్ట స్థాయిలో వినియోగించకూడదు. ప్రస్తుతం పాక్ కు కేటాయించిన పశ్చిమ నదుల నీటిని మన దేశం దాదాపు 13 లక్షల ఎకరాలకు వ్యవసాయం కోసం వినియోగించుకుంటుంది.
2. పశ్చిమ నదులపై ప్రాజెక్టులకు ఇండియాకు అనుమతి
మన దేశం పశ్చిమంగా ప్రవహించే ఇండస్, చీనాబ్, జీలం నదులపై నీటిని నిల్వచేయకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టులు నిర్మించవచ్చు. దీన్నే రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టులు అంటారు. నీటిని గణనీయంగా నిల్వ చేయకుండా ఈ ప్రాజెక్టుల ద్వరా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే వీటి నిర్మాణానికి పాకిస్థాన్‌కు ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా మన దేశం జీలం, చినాబ్ నదులపై కిష్టోబాగ్, బాగ్ లిహర్, సలాల్ వంటి హైడల్ ప్రాజెక్టులను నిర్మించింది.
3. నదీ జలాల సమాచార పరస్పర మార్పిడి
ఇండియా- పాకిస్థాన్ తమకు కేటాయించిన నదీ జలాల నీటి ప్రవాహం, నీటి మట్టం, వాతావరణ మార్పులు వంటి సమాచారాలు క్రమం తప్పకుండా ఇచ్చిపుచ్చుకోవాలని సింధు జలాల ఒప్పందం చెబుతోంది. మన దేశం పశ్చిమ నదులపై ఏదైనా ప్రాజెక్టు నిర్మించతలపెడితే ఆ పూర్తి సమచారం తప్పకుండా పాక్‌కు ఇవ్వాలి. వారి ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దానిపై చర్చలు జరిపి , పాక్ అనుమానాలు నివృత్తి చేసిన తర్వాతే ప్రాజెక్టులు నిర్మించాలని ఒప్పందంలో ఉంది.
4. పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు
రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం అమలు తీరును పర్యవేక్షించడానికి ఓ కమిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని పీఐసీ అంటే పర్మినెంట్ ఇండస్ కమిషన్ అంటారు. ఇందులో ఇండియా నుంచి ఒకరు, పాక్ నుంచి ఒకరు కమిషనర్‌గా ఉంటారు. ప్రతీ సంవత్సరం వీరు సమావేశమై నదీ జలాల ఒప్పందం అమలు తీరు, సమస్యలు, వాటి పరిష్కరాలపైన చర్చించాల్సి ఉంటుంది. అప్పుడే నదీ జలాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. వివాదాలు ఉంటే ఇరు దేశాలు ఉన్నతస్థాయి సమావేశాన్ని పెట్టుకుని చర్చించి పరిష్కరించుకోవాలి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఒక నిపుణుడైన తటస్థ మధ్యవర్తి సమక్షంలో చర్చించి సూచించిన నిర్ణయాన్ని అమలు చేయాలి. ఇలా గతంలో బాగ్ లిహార్, కిష్టోబాగ్ ప్రాజెక్టుపై తలెత్తిన వివాదాలను ఇరు దేశాలు మధ్యవర్తి సమక్షంలో పరిష్కరించుకున్నాయి.
6. కీలక పాత్ర వహించే ప్రపంచ బ్యాంకు
ఈ ఒప్పందం విషయంలో కీలక పాత్రధారి ప్రపంచ బ్యాంకు. వివాదాలు తలెత్తితే ప్రపంచ బ్యాంకు మీడియేటర్‌గా వ్యవహరించి రెండు దేశాలతో చర్చలు జరుపుతుంది. ఈ ఒప్పందం అమలు సాఫీగా సాగడానికి ఇరు దేశాలతో కలిసి పని చేస్తుంది. అయితే ఇందులో నుంచి ఏ దేశమైనా ఏక పక్షంగా వైదొలగకుండా ఎలాంటి నిబంధనలు లేవు. దాన్ని ప్రపంచ బ్యాంకు కూడా అడ్డుకోలేదు. ఏదైనా వివాదం తలెత్తితే మాత్రం ప్రపంచ బ్యాంకు పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తుంది.
7. ఉద్రిక్త సమయాల్లో కూడా ఒప్పందం అమలు
1960లో ఈ ఒప్పందం ప్రారంభమైన ఇండియా- పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినా రెండు దేశాలు ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి వైదొలగలేదు. 1965, 1971లలో జరిగిన యుద్ద సమయంలో, 1999 కార్గిల్ వార్ టైంలో ఒప్పందం ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత జరిగిన తాజ్ హోటల్ ఎటాక్, పుల్వామా, బాలా కోట్ దాడుల సమయంలోను వైదొలగలేదు. కాని పహల్గామ్ దాడి తర్వాత మోదీ సర్కార్ పాక్ వెన్ను విరిచేందుకు ఇండస్ వాటర్ ట్రిటీ రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల బాగా లాభపడేది పాకిస్థాన్. దీని వల్ల పాక్‌కు 80 శాతం నీటి వాటా దక్కుతుంటే ఇండియాకు దక్కేది కేవలం 20 శాతం మాత్రమే. ఈ నీటిపైనే పాక్ వ్యవసాయ రంగం ఆధారపడి ఉంది. ఈ నీటిని అడ్డుకుంటే పాక్ ఎడారి కాక తప్పదు.






















