Nagarjuna Sagar Issue: కృష్ణాబోర్డు చేతికి నాగార్జున సాగర్ డ్యాం - కేంద్ర బలగాల పర్యవేక్షణ! సమస్యకు పరిష్కారం
Water Disupute : నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ కృష్ణాబోర్డుకు కేంద్రం ఇచ్చింది. భద్రతను కూడా కేంద్ర బలగానే చూస్తాయి.
Nagarjuna sagar Water Disupute : నాగార్జున సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28వ తేదీకి ముందు ఉన్న పరిస్థితి కొనసాగించాలన్న కేంద్రహోంశాఖ కార్యదర్శి ప్రతిపాదనలకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. డ్యామ్ నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించడంతో పాటు సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అంగీకరించాయి. నాగార్జున సాగర్ వివాదంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్షలో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జలసంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు.
అంతకు ముందు కృష్ణాబోర్డు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి కేఆర్ఎంబీ లేఖ రాసింది. అక్టోబర్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో తెలిపింది. నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి లేఖ అందలేదని తెలిపింది. నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 15 టీఎంసీల నీటిని విడుదలకు ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ముందు అడగకుండా ఎలా నీటిని విడుదల చేస్తారని కేఆర్ఎంబీ ప్రశ్నించారు.
అక్టోబర్ 10 నుంచి 20 వరకు ఐదు టీఎంసీలు, జనవరి 8 నుంచి 18 వరకు 5 టీఎంసీలు ఏప్రిల్ 8 నుంచి 24 వరకు ఐదు టీఎంసీలు వాడుకునే విధంగా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు తాగునీటి అవసరాల కోసం మిగిలిన నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని, కానీ ఏపీ పరిమితికి మించి ఎక్కువ జలాలను వాడుకుంటోందని KRMB తెలిపింది. ఈ నేపథ్యంలో కాల్వల ద్వారా నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
మరో వైపు సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వినియోగం విషయంలో వివాదానికి సంబంధించిన కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేసును జనవరికి వాయిదా వేసింది. కాగా ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కృష్ణా ట్రిబ్యునల్‌కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు ఈ పిటిషన్‌పై గత విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.