Bill To Remove PM And Chief Ministers: కాంగ్రెస్ దారిలో నడవని శశిథరూర్ - వివాదాస్పద బిల్లుకు సపోర్టు - లోక్‌సభలో ఏం జరిగిందంటే ?
Controversial bill: లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓ బిల్లు దుమారం రేపుతోంది. జైలు పాలయితే ప్రధాని పదవి అయినా పోయేలా బిల్లులో ప్రతిపాదనలు పెట్టారు. కాంగ్రెస్ తీవ్రం గావ్యతిరేకిస్తోంది.

Bill proposing removal of ministers facing criminal charges: పార్లమెంట్ లో కొత్త రగడ ప్రారంభమయింది. లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ (130వ సవరణ) బిల్, 2025ను ప్రతిపాదించడమే కారణం. ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన చేయడంతో లోక్ సభ వాయిదా పడింది. పేపర్లను చింపి సభ్యులు అమిత్ షా మీద విసిరేశారు. అసలు ఈ వివాదాస్పద బిల్లులో ఏముందంటే ?
జైల్లో ఉంటే 31వ రోజు పదవులపై అనర్హత
ఈ బిల్ ప్రకారం, 30 రోజుల కంటే ఎక్కువ జైలులో ఉంటే, దోషిగా నిర్ధారణ కాకపోయినా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, లేదా ఇతర మంత్రులు తమ పదవులను కోల్పోవాల్సి ఉంటుంది. ఈ బిల్ ప్రకారం, 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించబడే నేర ఆరోపణలపై 30 రోజుల కంటే ఎక్కువ కాలం జైలులో ఉన్న ఏ మంత్రి అయినా (ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, లేదా ఇతర మంత్రులు) 31వ రోజున రాజీనామా చేయాలి లేకపోతే ఆటోమేటిక్ గా పదవిని కోల్పోతారు. ఒక వ్యక్తి దోషిగా నిర్ధారణ కాకముందే, కేవలం అరెస్ట్ జైలు శిక్ష ఆధారంగా పదవి నుండి తొలగిస్తారని ఇది న్యాయసూత్రాలకు విరుద్ధమన్న విమర్శలు వస్తున్నాయి.
విపక్ష సీఎంలను పదవుల నుంచి తప్పించడానికేనని కాంగ్రెస్ అనుమానం !
కాంగ్రెస్ నాయకులు ఈ బిల్ ద్వారా ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని, తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి, 30 రోజుల పాటు జైలులో ఉంచి, వారిని పదవుల నుండి తొలగించే అవకాశం ఉందని అంటున్నారు. "రేపు ఏ ముఖ్యమంత్రిపైనైనా ఒక కేసు నమోదు చేసి, 30 రోజులు జైలులో ఉంచితే, అతను/ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగలేరా? ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం" అని ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. గతంలో అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదైన సందర్భాలను ఉదాహరణగా చూపుతూ, ఈ బిల్ రాజకీయ ప్రతీకార చర్యగా ఉపయోగపడవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్ ద్వారా అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి, వారిని జైలులో ఉంచడం ద్వారా రాజకీయంగా బలహీనపరచవచ్చని విమర్శలు ఉన్నాయి. ఇది "మాస్ జస్టిస్" . "న్యాయవ్యవస్థ దుర్వినియోగం"కు దారితీస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ప్రియాంక గాంధీ వాద్రా, ఈ బిల్‌ను "డ్రాకోనియన్", "రాజ్యాంగ విరుద్ధం" అని విమర్శించారు. ఈ బిల్ రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని, న్యాయస్థానంలో దోషిగా నిర్ధారణ కాకముందే తొలగించే విధానం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని వారు భావిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసే కుట్ర
ఈ బిల్ ద్వారా జనాదరణ పొందిన ప్రభుత్వాలను లేదా ఎన్నికైన నాయకులను సులభంగా తొలగించే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇది ప్రజాస్వామ్య సూత్రాలను బలహీనపరుస్తుందని వారంటున్నారు. ఈ బిల్, న్యాయస్థానం తీర్పు ఇవ్వకముందే ఒక వ్యక్తిని శిక్షించేలా చేస్తుందని, ఇది రాజ్యాంగం ఇచ్చిన న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘిస్తుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలపై అధిక అధికారం ఇస్తుందని, ఇది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని ప్రతిపక్ష నాయకులు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రులను సులభంగా తొలగించే అవకాశం రాష్ట్ర స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి.
కాంగ్రెస్ కు షాకిచ్చిన శశిధరూర్
కాంగ్రెస్ వ్యతిరేకతకు భిన్నంగా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ బిల్‌ను సమర్థించారు, 30 రోజులు జైలులో ఉన్న వ్యక్తి మంత్రిగా కొనసాగడం సమంజసం కాదని, ఈ బిల్ సహేతుకమైనదని అభిప్రాయపడ్డారు. ఈ వైఖరి పార్టీలో ఆయనపై అసంతృప్తిని మరింత పెంచింది. కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత చూపిస్తూంటే ఆయన మాత్రం సమర్థిస్తున్నారు.





















