Bilkis Bano Case: చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పకండి, అది మా పరిశీలనలో ఉంది - బిల్కిస్ బానో పిటిషన్‌పై సుప్రీం కోర్టు
Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు విచారణకు కొత్త ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు సీజేఐ అసహనం వ్యక్తం చేశారు.
Bilkis Bano Case:
సీజేఐ అసహనం...
బిల్కిస్ బానో కేసుని విచారించేందుకు కొత్త ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ బేల ఎమ్ త్రివేది...బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించేందుకు ఆసక్తిచూపలేదు. బిల్కిస్ బానో తరపున న్యాయవాది శోభా గుప్తా ఈ పిటిషన్‌పై విచారణ జరపాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ పీఎస్ నరసింహను కోరారు. ఈ సమయంలో అసహనానికి గురైన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ "ఆ రిట్ పిటిషన్‌ను పరిశీలిస్తాం. మీరు చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పకండి" అని వారించారు. ఫలితంగా...ఈ విచారణ వాయిదా పడింది. బాధితురాలు బిల్కిస్ బానో..చాన్నాళ్లుగా సుప్రీం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. తనపై అత్యాచారం చేసిన దోషులను జీవిత ఖైదు పూర్తి కాకుండానే విడుదల చేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని గుజరాత్ ప్రభుత్వానికీ విజ్ఞప్తి చేసినా లాభం లేకుండా పోయింది. అందుకే...ఆమె న్యాయ పోరాటానికి దిగింది.
సుప్రీం కోర్టుకి బాధితురాలు..
11 మంది దోషులను సత్ర్పవర్తన కింద విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టు గడప తొక్కారు. గుజరాత్ ప్రభుత్వం చెప్పిన 1992 నాటి రెమిషన్ పాలసీని అనుసరిస్తూ సుప్రీం కోర్టు వారి విడుదలను అంగీకరిస్తూ ఇచ్చిన తీర్పుని సవాలు చేశారు. దీనిపై రిట్ పిటిషన్ వేశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు దీని గురించి ప్రస్తావన రాగా.."ఈ విషయాన్ని విచారిస్తాం" అని చెప్పారు. ఇరు పక్షాల పిటిషన్‌లను
ఒకేసారి విచారించొచ్చా లేదా అనేది పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న జైలు నుంచి విడుదల చేశారు. అప్పటి నుంచి గుజరాత్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అంత దారుణానికి ఒడిగట్టిన వారిని అంత సులభంగా ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. బిల్కిస్ బానో కూడా ఈ విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారు. అయితే...వీరిని విడుదల చేసే సమయంలో గుజరాత్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
1992 జులై 9న పాస్ చేసిన రెమిషన్ పాలసీ ఆధారంగా చూపిస్తూ...ఈ నిర్ణయం సరైందేనని తేల్చి చెప్పింది. "జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్లను సత్ప్రవర్తన కింద 14 ఏళ్ల జైలు శిక్ష తరవాత విడుదల చేసేందుకు అవకాశముంది" అని వివరణ కూడా ఇచ్చుకుంటోంది. బిల్కిస్ బానో కేసులో దోషులకు రెమిషన్ మంజూరు చేసి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలవ్వగా...గుజరాత్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది సర్వోన్నత న్యాయస్థానం. అందులో భాగంగానే...గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్‌ను సమర్పించింది. గతంలోనే...సుప్రీం కోర్టు బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయటానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను విచారించింది. గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. అంతే కాదు. గుజరాత్ ప్రభుత్వం ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ- రాజస్థాన్ సర్కార్ ప్రకటన