ముస్లింల ఓటు హక్కు తొలగించాలి, వాళ్లకు దేశంలో స్థానం లేదు - బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Bihar Politics: ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
Bihar Politics:
ఓటు హక్కు తీసేయాలి: హరిభూషణ్
బిహార్‌లో బడ్జెట్ సమావేశాలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు నితీశ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఒవైసీ లాంటి వాళ్లు దేశానికి ప్రమాదకరమని, ముస్లింల ఓటు హక్కుని తొలగించాలని డిమాండ్ చేశారు. ABP Newsతో మాట్లాడిన హరిభూషణ్ ముస్లింలకు ఈ దేశంలో స్థానం లేదని అన్నారు. వీళ్లు భారత్‌ను ముస్లిం దేశంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 2047 నాటికి ఈ లక్ష్యం చేరుకోవాలని చూస్తున్నారని మండి పడ్డారు. అసలు దేశం విడిపోయిందే మతం ఆధారంగా అన్న హరిభూషణ్...ముస్లింలందరూ పాకిస్థాన్‌కు వెళ్లిపోయారని అన్నారు. ప్రస్తుతం బీజేపీ యాక్టివ్‌గా ఉందని, వివక్షను ఏ మాత్రం సహించదని తేల్చి చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీ త్వరలోనే బిహార్‌కు రానున్నారు. మార్చి 18, 19 న సీమాంచల్‌లో పర్యటించనున్నారు. అక్కడే ర్యాలీ నిర్వహించనున్నారు. సీమాంచల్‌లో ముస్లింల జనాభా ఎక్కువ. మరి కొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో...ప్రచారానికి సిద్ధమవుతున్నారు అసదుద్దీన్. అయితే ఇలాంటి కీలక సమయంలో హరిభూషణ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. RJD నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు. ఆ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. FIR నమోదు చేయాలని, వీళ్లంతా బ్రిటిషర్ల తొత్తులు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్వాణి, మురళీ మనోహర్ జోషి కూతుళ్లు ముస్లింలనే పెళ్లాడారని, వాళ్లనూ దేశం నుంచి వెలివేయాలా అని ప్రశ్నించారు.
కర్ణాటక ఎమ్మెల్యే కూడా..
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ప్రార్థనలు చేసే సమయంలో లౌడ్ స్పీకర్‌లు పెట్టడంపై ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. "అల్లా చెవిటి వాడైతే ఆ స్పీకర్‌లు పెట్టి మరీ పిలవాలి" అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి Azaanపై డిబేట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది కర్ణాటక హైకోర్టులోనూ దీనిపై విచారణ జరిగింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఓ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతుండగా అదే సమయానికి పక్కనున్న మసీదులో నుంచి అజాన్ వినబడింది. అసహనానికి గురైన ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.
"నేను ఎక్కడికి వెళ్లినా ఇదో పెద్ద తలనొప్పిలా తయారైంది. సుప్రీంకోర్టులో తీర్పు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో అప్పుడు దీనికి ముగింపు పలక తప్పదు"
- కేఎస్ ఈశ్వరప్ప, బీజేపీ ఎమ్మెల్యే
అంతటితో ఆగకుండా అల్లాపై కామెంట్స్ చేశారు ఈశ్వరప్ప. ఆయనేమైనా చెవిటి వాడా అంటూ అపహార్యం చేశారు.
"ఆలయాల్లో యువతులు, మహిళలు పూజలు, భజనలు చేస్తారు. మాకూ మతంపై నమ్మకముంది. కానీ మేం మీలా లౌడ్‌స్పీకర్‌లు పెట్టం. లౌడ్‌స్పీకర్లు పెట్టి పిలిస్తే తప్ప పలకలేదంటే మీ అల్లా చెవిటి వాడై ఉంటాడు"
- కేఎస్ ఈశ్వరప్ప, బీజేపీ ఎమ్మెల్యే
Also Read: ప్రధాని మోదీకి నోబుల్ శాంతి బహుమతి! అబ్బే ఉత్తుత్తి ప్రచారమే