Bihar Hooch Tradegy: బిహార్‌లో మరోసారి కల్తీ మద్యం కలకలం, ఐదుగురు మృతి
Bihar Hooch Tradegy: బిహార్‌లో మరోసారి కల్తీ మద్యం కలకలం రేపింది.
Bihar Hooch Tradegy:
సివాన్ జిల్లాలో..
బిహార్‌లో చప్రా ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా వాదనలు జరుగుతున్న సమయంలోనే మరోసారి అలాంటి సంఘటనే జరిగింది. ఈ సారి సివాన్ జిల్లాలో ఐదుగురు కల్తీ లిక్కర్‌కి బలి అయ్యారు. ఈ ఐదుగురిలో ఓ వాచ్‌మెన్ కూడా ఉన్నాడు. ఈ మరణాలతో బ్రహ్మస్థాన్ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చప్రాకు పక్కనే ఉన్న సివాన్‌లో ఈ తరహా మరణాలు నమోదవడం మరింత సంచలనమైంది. కల్తీ మద్యం సేవించిన తరవాత ఉన్నట్టుండి వాళ్ల ఆరోగ్యం పాడైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా...చికిత్స జరుగుతుండగానే మరణించారు. గ్రామంలో విక్రయిస్తున్న మద్యాన్ని సేవించడం వల్లేఇలా జరిగిందని మృతులు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మద్యం సేవించి వచ్చిన రాత్రి బాగానే ఉన్నారని...తెల్లవారాక చూపు కోల్పోయారని ఆ తరవాత తలనొప్పి తీవ్రమైందని వివరించారు. ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయిందని చెప్పారు. ఇప్పటికే చప్రాలో కల్తీ మద్యం సేవించి 39 మంది మృతి చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అంటున్నారు. నితీష్ సర్కార్‌పై ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి.
ప్రతిపక్షాల విమర్శలు..
నితీష్ కుమార్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. మద్య నిషేధం సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి మరణాలు నమోదవుతున్నాయని విమర్శిస్తోంది. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే...దీనిపై సీఎం నితీష్ కుమార్ స్పందించారు. దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట ఇలా కల్తీ లిక్కర్ తాగి ప్రాణాలు కోల్పోతున్న వారున్నారని అన్నారు. బిహార్‌లో మాత్రం మద్య నిషేధం చాలా పక్కాగా అమలవుతోందని, కల్తీ మందు తాగిన ప్రతి ఒక్కరూ ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించారు. బిహార్‌లో మద్య నిషేధం అమలుపై ప్రస్తావన రాగా...నితీష్ కుమార్ సమాధానమిచ్చారు. "అన్ని పార్టీల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ దీని అమలు కోసం కట్టుబడి ఉన్నారు. కానీ... మనం ఎంత మంచి చేసినప్పటికీ ఎవరో ఒకరు చెడు చేయాలని చూస్తారు. నేరాలు అడ్డుకోటానికే కదా మనం చట్టాలు చేసుకుంది. కానీ...హత్యలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని బీజేపీ చెబుతోంది. కానీ చాలా మంది లబ్ధి పొందారని మేం కచ్చితంగా చెప్పగలం" అని వెల్లడించారు. రాష్ట్రంలో చాలా మంది మద్యం సేవించడం మానేశారని, భర్త తాగుడు మానాడన్న ఆనందం ఎంతో మంది మహిళల్లో ఉందని తెలిపారు. మద్యం సేవించడం మానేసి కుటుంబ బాధ్యతలు పంచుకుంటున్నారని చెప్పారు. "మద్యం మానేసి సాధారణ జీవితం గడుపుతున్న వాళ్లెందరో ఉన్నారు. ఇప్పుడు జరిగిన ఘటనను మాత్రం అసలు ఉపేక్షించం. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారెవరైనా సరే వారిని పట్టుకుంటాం. కఠినంగా శిక్షిస్తాం" అని తేల్చి చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కల్తీ మందు తాగి చనిపోతున్న వారు లేరా అని ప్రశ్నించారు.
Also Read: Greater Noida Crime: మాకు నీ కుక్క కావాలి, అది ఇస్తే కానీ వదిలేది లేదు - కిడ్నాపర్ల వింత డిమాండ్