Bhatti Vikramarka: బీఆర్ఎస్ కట్టిన ఒక ప్రాజెక్టూ కూలిపోతోంది, దివాళా పనుల సెట్ చేసుకోవడం మాకు కష్టమే: భట్టి
Telangana Assembly: తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, దివాళా పనులను సెట్ చేసుకోవడం మాకు కష్టమే అని భట్టి విక్రమార్క అన్నారు.
Telangana Latest News: బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కాళేళ్వరం ప్రాజెక్టు మాత్రమే కట్టిందని, అది కూడా ఎన్నికలకు ముందే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రంపై చర్చలో భాగంగా భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల, వారు చేసిన అప్పులను భరించడానికి.. తిరిగి అప్పులు చేయాల్సి వస్తోందని అన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని భట్టి విక్రమార్క చెప్పారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక ప్రణాళిక లేకుండా నష్టపరిచారని అన్నారు. దేశంతో తెలంగాణ పోటీ పడాలనే తాము శ్వేతపత్రం విడుదల చేశామని, రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు స్పష్టంగా తెలపాలనే ఉద్దేశంతోనే ఈ శ్వేతపత్రం విడుదల చేశామని అన్నారు. తాము శ్వేత పత్రం విడుదల చేస్తామని చెప్పగానే.. వద్దన్నారని, అవి బయటకు చెప్తే పరువు పోతుందంటున్నారని అన్నారు. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పడానికే తాము శ్వేతపత్రం విడుదల చేశామని విక్రమార్క వివరించారు. రాష్ట్రానికి నిధులు ఎలా వచ్చాయి.. ఎలా దారి మళ్లాయి అనేది ప్రజలకు అన్ని వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు. ప్రణాళికబద్దంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెద్ద సవాల్ ఉందని చెప్పారు.
అభివృద్ధి ద్వారా వచ్చే ఆస్తులు, వాటి ద్వారా ఏర్పడే సంపదతో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుందని భట్టి అన్నారు. ఏ బడ్జెట్‌లో అయినా అంచనాలకు, ఖర్చుకు గ్యాప్ ఉంటుందని.. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సార్లు 20 శాతం కంటే ఎక్కువ గ్యాప్ ఉండేదని అన్నారు. మొదటి నుంచి వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ లేదని విమర్శించారు. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని అంతా భావించగా.. అంతా రివర్స్ అయ్యిందని అన్నారు. బడ్జెట్ అంటే అంకెల గారడీ చేసేశారని విమర్శించారు.
ఓఆర్ఆర్ కూడా కాంగ్రెస్ హాయాంలోనే పూర్తి అయితే, దాన్ని కూడా తక్కువ ధరకు మరో కంపెనీకి లీజుకు ఇచ్చారని విమర్శించారు. ఇలా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, దివాళా పనులను సెట్ చేసుకోవడం తమకు కష్టమే అని అన్నారు. అటు కార్పొరేషన్ల పేరుపై ఉన్న రుణాలు కూడా వాటికవే తీర్చుకోలేవని, వాటిని కూడా ప్రభుత్వమే తీర్చాల్సి ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చలో పాల్గొన్న వారు అందరికీ భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు.