Bandi Sanjay: హిందూ దేవుళ్లంటే ఒవైసీకి చులకన, ఆయన మాటలు కుట్రలో భాగమే - బండి సంజయ్
Bandi Sanjay News: శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన రాముడి అక్షింతలను ఈరోజు ఉదయం కరీంనగర్ లోని చైతన్యపురిలో ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.
Bandi Sanjay Comments on Asaduddin Owaisi: అయోధ్యలో ఈనెల 22న అంగరంగ వైభవంగా జరగబోయే రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ది పొందాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యానించారు. అందులో భాగంగా 500 ఏళ్లపాటు ఖురాన్ చదివిన ప్రదేశం మనకు కాకుండా పోతుంటే మీ గుండెల్లో బాధ లేదా? అంటూ ముస్లిం యువతను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.
శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన రాముడి అక్షింతలను ఈరోజు ఉదయం కరీంనగర్ లోని చైతన్యపురిలో ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో బండి సంజయ్ (Bandi Sanjay) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి ఇండ్లకు వెళ్లి స్వయంగా శ్రీరాముడి అక్షింతలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఈనెల 22న అయోధ్యలో జరిగే దివ్యమైన, భవ్యమైన రామమందిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడంతోపాటు ఆరోజు సాయంత్రం ప్రతి హిందువు తమ తమ ఇండ్లల్లో దీపాలు వెలిగించాలని కోరారు.
ఈ సందర్భంగా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ (Bandi Sanjay) స్పందిస్తూ.. ‘‘దేశవ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు సైతం రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించిన దాఖలాల్లేవు. రాజకీయాలకు అతీతంగా రామ మందిర నిర్మాణం కోసం దేశంలోని ప్రతి ఒక్క హిందువు తమ వంతు సాయం చేసి అద్బుతమైన రామ మందిరాన్ని నిర్మించుకున్నారు. ఈనెల 22న జరగబోయే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేని ఒవైసీ ఈ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
‘‘ముస్లిం సమాజంపై ఎంఐఎం క్రమక్రమంగా పట్టు కోల్పోతోంది. సుప్రీం కోర్టు తీర్పును కొందరు ముస్లిం మత పెద్దలు మద్దతిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని ఒవైసీ ఎంఐఎం పార్టీ స్వలాభం కోసం యువతను రెచ్చగొడుతున్నారు’’ అని బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ కార్యక్రమం బీజేపీకి సంబంధించినది కాదనే విషయాన్ని ఒవైసీ గుర్తుంచుకోవాలని అన్నారు.
‘‘దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పును వ్యతిరేకించేలా ఒవైసీ వ్యాఖ్యానించడం సిగ్గు చేటు. ఎంఐఎం నేతలకు కోర్టులు, చట్టాలు, దేశం, దేశభక్తులు, హిందూ సమాజం, హిందూ దేవుళ్లంటే గౌరవం లేదు. చులకన భావంతో చూసే దుర్మార్గమైన పార్టీ. ఎంఐఎం వంటి పార్టీలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. ఒవైసీ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవద్దు’’ అని కోరారు. బీజేపీ ప్రభుత్వం మసీదులను లాక్కోవచ్చంటూ ఒవైసీ వ్యాఖ్యానించడాన్ని బండి సంజయ్ (Bandi Sanjay) ఖండించారు. ‘‘బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్ని మసీదులను లాక్కుందో, కూల్చిందో ఒవైసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.